తెలంగాణ

telangana

ETV Bharat / city

రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం - Railway Apprenticeship updates

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్​షిప్​ విషయంలో స్థానిక అభ్యర్థులకు అన్యాయం చేస్తోంది. స్థానికులతో పాటు ఇతరులకు అవకాశం కల్పిస్తుండడం వల్ల కేవలం కొద్ది మంది స్థానికులకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. అప్రెంటీస్​షిప్​ ప్రకటనలో మిగతా జోన్లు కేవలం స్థానికులకే అవకాశం కల్పిస్తున్నా.. దక్షిణ మధ్య రైల్వే మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎంపీల స్థాయిలో ఒత్తిడి చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Railway Apprenticeship in scr region
రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం

By

Published : Dec 4, 2019, 9:56 AM IST

రైల్వే సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తే ఉద్యోగం సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయి. రైల్వేశాఖ చేపట్టే గ్రూప్‌-డి నియామకాల్లో 20 శాతం పోస్టులు అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారికి లభిస్తాయి. ఇంత కీలకమైన అప్రెంటిస్‌షిప్‌ల ఎంపికలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనుసరిస్తున్న విధానం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోంది. ఇతర రైల్వే జోన్లు.. స్థానికుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంటే.. సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తోందని అభ్యర్థులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడలా.. ఇక్కడిలా..

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఆరు డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో లాలాగూడ వర్క్‌షాప్‌, విజయవాడ, కాజీపేట, గుంతకల్లు, మౌలాలిలలో డీజిల్‌ లోకోషెడ్లు సహా మొత్తం 24 చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైల్వే విభాగాల్లో 4,103 అప్రెంటిస్‌షిప్‌ల ఖాళీల భర్తీకి కొద్ది రోజుల క్రితం రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ద్వారా ప్రకటన ఇచ్చింది. పదోతరగతితో పాటు ఐటీఐ విద్యార్హత ఉన్నవారు వీటికి అర్హులు. దేశంలో ఈ అర్హతలున్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు ద.మ.రైల్వే వెసులుబాటు కల్పించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే అప్రెంటిస్‌షిప్‌ల భర్తీకి డిసెంబరు 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జోన్‌ భౌగోళిక ప్రాంతం పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. దానివల్ల స్థానికులకే అవకాశం లభిస్తుంది. దేశంలోని చాలా జోన్లు ఇదే పంథాను అనుసరిస్తున్నాయి.

పట్టించుకోని అధికారులు

ఇతర జోన్లలో స్థానికులకే అప్రెంటిస్‌షిప్‌ అవకాశం ఇస్తున్నారని ద.మ.రైల్వేకు పలువులు సూచించినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే విషయమై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌.. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాసినా స్పందన రాలేదు.

ఎంపీలు ఒత్తిడి చేస్తే పరిష్కారం

ద.మ.రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ దరఖాస్తుకు డిసెంబరు 8వ తేదీ వరకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఎంపీలు రైల్వే శాఖ, ద.మ.రైల్వేపై ఒత్తిడి తీసుకొస్తే.. ప్రస్తుత ప్రకటనను రద్దు చేసి జోన్‌ పరిధిలో స్థానికులకే అవకాశం కల్పించేలా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇవీచూడండి: దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details