గ్రేటర్ పరిధిలోకి 24 నియోజకవర్గాలు వస్తే అందులో 13 చోట్ల ఒక్క డివిజన్‌నూ తెరాస దక్కించుకోలేకపోయింది. ఈ పదమూడింటిలోనే 75 వరకు డివిజన్లు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో ఈ డివిజన్లలో సగం గెల్చుకోవడంతో భారీ విజయాన్ని తెరాస నమోదు చేసింది. వీటిలో ఇప్పుడు 25 స్థానాలలో గెలుపొందినా మేయర్ పీఠం సునాయాసమయ్యేది. అక్కడ ఎందుకిలా జరిగిందన్న దానిపై అధిష్ఠానం విశ్లేషణ చేస్తోంది.
ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ..
- పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో 44 డివిజన్లు ఉంటే తెరాస గత ఎన్నికల్లో మూడింటిలో విజయం సాధించింది. ఈసారి ఒక్కటీ దక్కకపోగా గతంలో గెలుపొందిన మూడింటిలోనూ భాజపా పాగా వేసింది.
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉంటే గతసారి తెరాస వీటన్నింటిని గెల్చుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది..అనంతరం తెరాసలో చేరారు. అన్ని డివిజన్లనూ తెరాస గెలుస్తుందని భావించగా.. మొత్తం భాజపాకే వచ్చాయి.
- రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అయిదు స్థానాలుంటే అందులో మూడింట గతంలో తెరాస గెలుపొందింది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తోడ్పాటుతో నాలుగు స్థానాల్లో గెలుస్తారని ఆ పార్టీ అంచనా వేసుకుంది. ఒక్కటీ తెరాస గెలవకపోగా.. ఎమ్మెల్యే సోదరుడు సైతం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో ఓడిపోయారు.
- ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరు స్థానాలుంటే గతసారి అయిదింటిలో తెరాస గెలిచింది. ఎమ్మెల్సీ కవితతోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్రంగా పోరాడినా ఒక్క స్థానాన్ని కూడా తెరాస దక్కించుకోలేకపోయింది. ఎమ్మెల్యే మరదలు పద్మ గాంధీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
- మహేశ్వరంలో రెండు స్థానాలుంటే గతసారి ఒకటి తెరాస దక్కించుకుంది. ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కృషి చేసినా ఒక్కటీ దక్కలేదు.
- గోషామహల్ నియోజకవర్గంలో 5 స్థానాలలో భాజపా విజయం సాధించి తెరాసపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
- కంటోన్మెంట్‌లోని ఒక డివిజన్ గ్రేటర్ పరిధిలోకి వస్తుంది. 2016లో ఇక్కడ తెరాస గెలవగా ఈసారి భాజపా కైవసం చేసుకుంది.