నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన! శాసనసభ ఎన్నికల సందర్భంగా తెరాస మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 3వేల 16 చొప్పున నెలనెలా భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2019 రాష్ట్ర బడ్జెట్‌లో ఇందుకోసం 1,810 కోట్లు కేటాయించారు. తర్వాత ఆర్థిక ప్రతికూలతలతో ఈ పథకాన్ని అమలు చేయలేదు. తాజాగా మరోసారి ఈ హామీ అమలు తెరపైకి వచ్చింది. నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఒకటి రెండురోజుల్లో ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
20 లక్షల నిరుద్యోగులు...
మంత్రి కేటీర్ వ్యాఖ్యలతో మరోసారి ఈ హామీ అమలు దిశగా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఐతే నిరుద్యోగ భృతికి లబ్ధిదారులుగా ఎవరిని ఎంపిక చేయాలి? ఏయే అర్హతలు ప్రామాణికంగా తీసుకోవాలనేది కీలక అంశంగా మారింది. రాష్ట్రంలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో 11 లక్షలమంది ఉద్యోగాల కోసం నమోదు చేసుకుని ఉన్నారు. టీఎస్‌పీఎస్‌సీ, ఇతర నియామకాల సందర్భంగా 20 లక్షలమందికి పైగా డిగ్రీ అర్హతతో కలిగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మొత్తం 20 లక్షలమంది నిరుద్యోగులు ఉంటారని, వారికి 3,016 చొప్పున భృతి ఇస్తే ఏటా రూ. 4,800 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి.
ఆధార్‌లోనూ ఉద్యోగిత చేర్చితే...
నిరుద్యోగిని గుర్తించడానికి శాస్త్రీయ విధానాలు, గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. నిరుద్యోగులుగా నమోదు చేసుకున్న వారు ఉద్యోగాలు వచ్చాక ఉపాధి కల్పన కార్యాలయాల్లో తమ పేరును తొలగించుకోవడంలేదు. స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్ధారించడానికి వీలున్నా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు మినహా ఇతర రంగాల వారు ఆ విషయాన్ని వెల్లడిస్తారా? అనే సంశయం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పీఎఫ్‌లు, ఈపీఎఫ్‌లు, ఈఎస్‌ఐ, బ్యాంకు వేతన ఖాతాల ద్వారా ఉద్యోగులను గుర్తిస్తున్నారు. తాజాగా ఆధార్‌లోనూ ఉద్యోగితను నమోదు చేయడం ద్వారా నిరుద్యోగుల గుర్తింపునకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
అధ్యయనం చేయాలి...
నిరుద్యోగ భృతి అమల్లో ఉన్న, గతంలో అమలు చేసిన పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు నిరుద్యోగితపై సెర్ఫ్, మెప్మా తదితర సంస్థల ద్వారా ఇంటింటి సర్వే చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కొన్ని బోగస్ సంస్థలు దరఖాస్తు ఫారాలు, వెబ్‌సైట్ల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేశాయి. ఈసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.