Hyderabad- Vijayawada NH: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఎక్స్‌ప్రెస్ వే గా విస్తరణ జరిగి.. దశాబ్దం అవుతున్నా బాలారిష్టాలు తొలగలేదు. ఈ రోడ్డుపై ప్రమాదాలతో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2007లో ఈ రహదారి విస్తరణకు నిర్ణయించారు. పనుల కాంట్రాక్టు పొందిన జీఎమ్మార్ సంస్థ దీన్ని నిర్మించి.. 2012 అక్టోబరులో వినియోగంలోకి తెచ్చింది. రాజకీయ ఒత్తిళ్లతో పలు ప్రాంతాల్లో నిర్మాణం లోపభూయిష్టంగా సాగింది. తగినన్ని అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించకపోవటంతో తరచూ ప్రాణనష్టం సంభవిస్తోంది.
పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడో.. ఆగ్రహంతో ప్రజలు ఉద్యమించినప్పుడో మాత్రమే అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నించడంలేదు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తరచూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారి దుస్థితిని వివరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎంపీలతో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించినా దిద్దుబాటు చర్యలకు ముందడుగు పడలేదు.
అండర్‌పాస్‌ల అవసరం ఇక్కడే..: చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం చౌరస్తా, పెద్దకాపర్తి, చిట్యాల బస్టాండు, నల్గొండ క్రాస్‌రోడ్డు, చందంపల్లి క్రాస్‌రోడ్డు, కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, టేకుమట్ల, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో, జనగాం క్రాస్‌రోడ్డు, సూర్యాపేట శివారు, ముకుందపట్నం, కొమరబండ క్రాస్‌రోడ్డు, కోదాడ బైపాస్, రామాపురం క్రాస్‌రోడ్డు తరచూ ప్రమాదాలు జరిగే మునగాల మండలం మొద్దులచెరువు ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి తాత్కాలిక చర్యలతో సరిపెట్టారు. శాశ్వత నివారణ చేపట్టాలి.
సర్వీసు రోడ్లు లేక.. గాల్లో ప్రాణాలు:నకిరేకల్ వద్ద 2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా, సర్వీసురోడ్డు నిర్మించలేదు. దీనికోసం భేచందంపల్లి, గొల్లగూడెం, అడవిబొల్లారం, పెర్కబాయిగూడెం, భూపతికుంట, మాణిక్యాలగూడెం గ్రామాల ప్రజలు మూడేళ్లుగా పోరాడుతున్నారు. మునగాలలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటుప్పల్‌లో ఏడాది కిందట చెరువు అలుగు పారటంతో సర్వీసు రోడ్డును పలు ప్రాంతాల్లో తవ్వి వదిలేశారు. కట్టంగూరు, తిప్పర్తి ఫ్లైఓవర్, ఇనుపాముల, ఆకుపాముల బైపాస్‌రోడ్డు, కేకే గూడెం క్రాస్‌రోడ్డు, మేళ్లచెరువు ఫ్లైఓవర్, నల్లబండగూడెం, నవాబ్‌పేట సమీపాల్లో సర్వీసు రోడ్లు తప్పనిసరి. ఇవన్నీ అర కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల పొడవుకు మించవు. మరోవైపు హైదరాబాద్ శివారునున్న మల్కారం నుంచి తెలంగాణ సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో వీయూపీ (వెహికల్ అండర్ పాస్)లు నిర్మిస్తే ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు.