ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న యూకే వైరస్ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49ఏళ్ల వ్యక్తిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. ఐతే వైద్యఆరోగ్యశాఖ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమి లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండటంతో... వాటన్నింటి ఫలితాలు సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖే వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిలో గుర్తింపు!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... వరంగల్ నగర జిల్లాకు చెందిన వ్యక్తిలో కొత్తరూపు సంతరించుకున్న కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తిలో ఈ నెల 16న కొవిడ్ లక్షణాలు కనిపించగా స్థానికంగా పరీక్షలు చేయించారు. 22న వెల్లడైన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల కిందట సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. కరోనా జన్యుపరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌లో గణనీయ మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరస్.. ఇది ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చారు. బాధితుడి కుటుంబసభ్యులకు యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. బాధితుడి భార్య సహా ఇతరులకు కొవిడ్ నెగిటివ్ రాగా..... 71ఏళ్ల వయస్సు ఉన్న అతడి తల్లి పాజిటివ్‌గా తేలింది. ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం సీసీఎంబీకి పంపించారు.