power cuts in AP: వేసవి ఉష్ణోగ్రతలు పెరగటంతో డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు చేతులెత్తేశాయి. డిమాండ్, సరఫరా మధ్య బుధ, గురువారాల్లో సుమారు 2 కోట్ల యూనిట్ల వ్యత్యాసమేర్పడింది. లోడ్ సర్దుబాటు పేరుతో డిస్కంలు ప్రతి జిల్లాలోనూ 2,3 గంటల కోత విధిస్తున్నాయి. కోతలను మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. దీంతో ఏ సమయంలో విద్యుత్ సరఫరా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏప్రిల్ ఆరంభంలోనే విద్యుత్ డిమాండ్ 235 ఎంయూలకు చేరింది. వారంలోగానే 240 ఎంయూలు దాటుతుందని అంచనా.
దేశవ్యాప్తంగా గిరాకీ పెరగటంతో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. పీక్ డిమాండ్ (సాయంత్రం6 నుంచి రాత్రి 10గంటలు) సమయంలో యూనిట్ ధర రూ.20పెట్టి కొనాల్సి వస్తోంది. రాష్ట్రంలో మార్చి 1న 207.72 ఎంయూల విద్యుత్తు వినియోగం ఉంది. తాజా డిమాండ్ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌నుంచి రోజూ 45-50 ఎంయూలు కొనాల్సి వస్తోంది. నెలకిందటి వరకు బహిరంగ మార్కెట్‌లో యూనిట్ సగటున రూ.4-5 మధ్య చెల్లించిన విద్యుత్ సంస్థలు ఇప్పుడు రూ.7 చెల్లించాల్సి వస్తోంది. ఏపీఈఆర్‌సీ అనుమతించిన రూ.3.86కంటే దాదాపు రెట్టింపు మొత్తం ఇది. గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్ రూ.20పెట్టి కొందామన్నా దొరకటం లేదు.