అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ అంశంపై తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం హైదరాబాద్ ఎర్రమంజిల్ రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో జరిగింది. మార్గాల వారీ ప్రాతిపదికన మాత్రమే ఏపీకి బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. ప్రతిపాదన గురించి ఆలోచించి మళ్ళీ చర్చలకు వస్తామని ఏపీ అధికారులు తెలిపినట్లు సునీల్ శర్మ వివరించారు. హైద్రాబాద్ - విజయవాడల మధ్య చెరో 250 బస్సులను నడిపే అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదన్నారు.
కుదరని ఏకాభిప్రాయం... ముందుకు కదలని ప్రగతి చక్రం - inter state bus services
ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది. కరోనా కారణంగా నిలిచిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు చర్చించారు. బస్సులు నడపడంపై ఏపీఎస్ ఆర్టీసీ ఒక మెట్టు దిగి వచ్చినా... తెలంగాణ ఆర్టీసీ మాత్రం గట్టిగా తన వాదనలను వినిపించింది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే అంశంపై ఇరు రాష్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
బస్సుల పునరుద్ధరణకు సంబంధించి కిలోమీటర్ల ప్రాతిపదికన నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన పెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు అన్నారు. కిలోమీటర్ల ప్రాతిపదికనే అంతరాష్ట్ర సర్వీసులున్నాయని.. తెలంగాణలో ఏపీ బస్సులు 71రూట్లలో నడుస్తోంటే.. ఏపీలో తెలంగాణ బస్సులు 28 రూట్లలో మాత్రమే నడుస్తున్నాయని కృష్ణబాబు వివరించారు.
రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు త్వరలోనే మరో దఫా భేటీ కానున్నారు. ఆ సమావేశంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.