తెలంగాణ

telangana

ETV Bharat / city

గల్లంతై 30 గంటలపైనే అయ్యింది.. అయినా దొరకని ఆచూకీ - మృతుని జాడకోసం కొనసాగుతున్న చర్యలు

మురుగు నీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికుడు గల్లంతై 30 గంటలకు పైగా గడిచింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది... మూడు రోజులుగా కార్మికుడి ఆచూకీ కోసం వెతుకుతున్నా జాడ దొరకలేదు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని.. బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.

manhole
manhole

By

Published : Aug 5, 2021, 5:17 PM IST

హైదరాబాద్‌ ఎల్​బీనగర్‌లోని సాహెబ్​నగర్‌లో మురుగునీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్ లోకి దిగి గల్లంతయిన కార్మికుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చంపాపేట్ చింతలబస్తీకి చెందిన కార్మికులు శివ, అంతయ్య మురుగునీటిని శుభ్రపరిచేందుకు మంగళవారం రాత్రి.... మ్యాన్ హోల్​లోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరి ఆడక గల్లంతయ్యారు. శివ మృతదేహం వెలికి తీయగా.. అంతయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. అంతయ్య డ్రైనేజీ లైన్​లో మరింత కిందకు కొట్టుకుపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

చేయని ప్రయత్నం లేదు..

అంతయ్య ఆచూకీ కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. మూడు రోజులుగా సాహెబ్‌నగర్‌లోని ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పలు మ్యాన్‌హోళ్ల వద్ద 150 అడుగులకు పైగా ఇప్పటికే తవ్వారు. మట్టిని గుట్టలుగా కాలనీలో పోశారు. ప్రొక్లెయినర్లు, మురుగునీటిని తొలగించే యంత్రాలతో సహాయ చర్యలు సాగుతున్నప్పటికీ అంతయ్య జాడ మాత్రం కనిపించడం లేదు.

గుత్తేదారుల నిర్లక్ష్యంతోనే..

జీహెచ్‌ఎంసీ అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే శివ మృతి చెందగా... అంతయ్య గల్లంతయ్యాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళ కార్మికులను మురుగు శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోళ్లలోకి దించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ గుత్తేదారు ఒత్తిడితోనే వారిద్దరు దిగాల్సివచ్చిందని బాధిత బంధువులు చెబుతున్నారు. అంతయ్య జాడ కనుగొనడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

30 గంటలపైనే అయ్యింది.. అయినా దొరకని ఆచూకీ

'ఆరోజు రాత్రి సమయంలో పని ఉందని చెప్పి మా వాళ్లను తీసుకెళ్లారు. అక్కడ మ్యాన్​హోల్​ ఎంత ఉందో చెప్పలేదు. తొందరపెట్టి అందులోకి దింపేశారు. మొదటగా శివ దిగాడు. ఆయన ఒక్కడితో కాకపోవడం వల్ల సాయం చేద్దామని అంతయ్య కూడా వెళ్లాడు. చెయ్యిపట్టుకుని పైకి లాగుతున్న సమయంలో ఇద్దరు అందులోనే పడిపోయారు. ఘటన జరిగినప్పుడు కాంట్రాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారంట. వాళ్లను బయటకు ఎలా తీయాలో ఆలోచించకుండా.. ఎట్లా తప్పించుకోవాలా అని చూశారు. పడిపోయిన గంట తర్వాత మాకు ఫోన్​ చేసి చెప్పారు. గంటపాటు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము వచ్చేసరికి ఒక్కరి మృతదేహం దొరికింది. అంతయ్యది కనిపించలేదు.

-మృతుని బంధువు

ఇంకా ఎన్ని జరగాలి...

గత అయిదేళ్ల కాలంగా సరూర్‌నగర్‌, మన్సూరాబాద్‌ తాజాగా సాహెబ్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఘటనల్లో 8 మంది కార్మికులు మృతి చెందారు. అధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు... గుత్తేదారుల ఇష్టారాజ్యం వలనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన శివ అనే కార్మికుడి మృతదేహాన్ని అప్పగించడంలో కూడా పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కాగా కార్మికుడు అంతయ్య ఆచూకీ కోసం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పసుమాముల వైపు కూడా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాంట్రాక్టర్​పై కేసు

సాహెబ్‌నగర్‌ నాలా ఘటనకు కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్ తెలిపారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. రాత్రి వేళ డ్రైనేజీ శుభ్రం చేయడానికి అనుమతి లేనప్పటికీ... కాంట్రాక్టర్ ఒత్తిడితోనే శివ, అంతయ్యలు మురికి కాలువలోకి దిగి మృత్యువాతపడ్డారని వివరించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details