KTR and Mansukh Mandaviya Twitter War : తెరాస సర్కార్- భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే... ప్రభుత్వం వైద్య కళాశాలల మంజూరు అంశంపై కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగింది. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల మంజూరు చేయలేదన్న కేటీఆర్ ట్వీట్‌కు కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు.
KTR and Mandaviya Tweet War : తెలంగాణ ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలల ఏర్పాటుకు ఒక్క ప్రతిపాదన కూడా రాలేదన్న మాండవీయ.. స్వల్పకాలంలోనే ప్రధాని మోదీ అత్యధిక సంఖ్యలో వైద్యకళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు వైద్య కళాశాలలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. వైద్య కళాశాలల కోసం 2015 నుంచి 2019 వరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులకు ప్రతిపాదనలు పంపినట్లు గత లేఖలను ట్వీట్‌తో జతపరిచారు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అడిగినప్పటికీ కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదన్న ఆయన... బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉన్న 544 ఖాళీలను కూడా కేంద్రం భర్తీ చేయలేదని ఆరోపించారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని, తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదని వాస్తవమని కేటీఆర్ ట్వీట్ చేశారు.