జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ.. నిన్ను తాకినంతనే పుణ్యమని.. గత జన్మల సంచితాలు తొలగునని.. నీ వైభవం కాంచినంతనే భాగ్యమని భక్తుల నమ్మిక. శ్రీరాముడి పాద స్పర్శతో రాళ్లు రమణులుగా మారిన భూమి.. రాయల పాలన ఘనముగ సాగిన చరిత.. తెల్లదొరలకు తాకిన ఉయ్యాలవాడ పౌరుషాగ్ని.. అన్నీ నీ చెంతనే.. నీ చలవనే. ఈ 12 ఏళ్ల పుష్కర పండగ మ‘నది’. మా నదిది.
రాఘవేంద్రుని సన్నిధానం.. పుష్కరాలకు సంసిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర వేడుకల కోసం మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధానం సిద్ధమైంది. భక్తుల కోసం దర్శనాలు, పరిమళ ప్రసాదాలు, అన్నదానం తదితర ఏర్పాట్లను పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో అధికారులు సిద్ధం చేశారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 రెండు గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉచిత దర్శనాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. భక్తుల సంఖ్య పెరిగితే దర్శనం మరో గంట పాటు పెంచే అవకాశం ఉంది. దర్శనాల కోసం అదనంగా వరసలు, వీఐపీల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు పరిస్థితులను బట్టి ప్రత్యేక గేటు ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. 12 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పుష్కరాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రానున్నారని, సంకల్‌బాగ్ పుష్కర ఘాట్‌ను సర్వం సిద్ధంగా ఉంచాలని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం ఆదేశించారు. గురువారం స్థానిక సునయన ఆడిటోరియంలో పుష్కర ఏర్పాట్లపై వారు సమీక్షించారు. పాత పంప్‌హౌస్ ఘాట్‌లో కొత్తగా నిర్మించిన బహుళ ప్రయోజన వినియోగ భవనాన్ని ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు.
రోజూ.. ఒక్కో దేవతారాధన
తుంగభద్ర జీవనదికి పుష్కర ఘడియలు సమీపించాయి. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగాన్ని అనుసరించి నేటి మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి(గురు) గ్రహం మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పన్నెండు రోజులూ పూజలు, దానాలు నిర్వహించాలన్నది శాస్త్ర వచనం. ఒక్కోరోజు.. ఒక్కో దేవతను పూజించడంతోపాటు దానాలు చేయాలని వేద పండితులు చెబుతున్నారు. - ఈనాడు డిజిటల్- కర్నూలు
- మొదటి రోజు - పుష్కరాల్లో తొలి రోజు మహావిష్ణువును పూజించాలి. గురు జప మంత్రాన్ని పఠిస్తూ ఉండటం మంచిది. బంగారం, వెండి, భూమి, ధాన్యం వంటివి దానం చేయాలి.
- రెండో రోజు- ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజించాలి. చటక శ్రాద్ధాన్ని ఆచరించడం శ్రేష్ఠం. గోవు, వస్త్రం, రత్నాలు, ఉప్పు వంటివి దానమివ్వాలి.
- 3వ రోజు- లక్ష్మీదేవిని పూజించి పితృ దేవతలకు తర్పణాలు వదలాలి. నగదు, కూరగాయలు, పండ్లు, బెల్లం, గుర్రాన్ని దానం చేయాలి.
- 4వ రోజు- వినాయకుడిని పూజించడంతోపాటు, ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఈ రోజంతా పఠిస్తూ ఉండటం మంచిది. నెయ్యి, నూనె, పాలు, తేనె, పానకం దానం చేయాలి.
- 5వ రోజు- శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. ‘‘ఓం సూర్యాయ నమః’’ లేదా ‘‘ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః’’ అనే మంత్రాన్ని రోజంతా పఠిస్తూ ఉండటం మంచిది. ఈరోజు స్వయంపాకం భుజించడం మంచిది. అంటే ఎవరి వంట వారే వండుకుని తినాలని శాస్త్ర వచనం. ఈ రోజు ధాన్యం, దున్నపోతు, ఎద్దు, గేదె, బండి, నాగలి వంటివి దానం చేయాలి.
- 6వ రోజు- చదువుల తల్లి సరస్వతిని పూజించాలి. ప్రధానంగా విద్యార్థులు పుష్కర స్నానమాచరించి సరస్వతీ పూజ చేయడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. ఆరో రోజు లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి. ఔషధ దానం చేయాలి. అంటే అనారోగ్యంతో ఉన్న రోగులకు ఔషధాలు ఇవ్వాలి. దీంతోపాటు గంధం, కస్తూరి, కర్పూరం వంటివి దానం చేయాలి.
- 7వ రోజు - గౌరీ పూజను నిర్వహించడంతోపాటు గణేశ మంత్రాన్ని జపించాలి. ఈరోజు ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రయాగ-త్రివేణి సంగమంలో లక్ష మందికి దానం చేసిన ఫలం వస్తుంది. ఈ రోజున మంచం, పల్లకి, ఊయల, ఇల్లు వంటివి దానం చేయాలి.
- 8వ రోజు - మంగళకరుడైన పరమేశ్వరుడిని పూజించడంతోపాటు, శ్రీకృష్ణ మంత్రాన్ని జపించాలి. 8వ రోజు బ్రాహ్మణుడికి అంగ వస్త్రాన్ని దానం చేయాలి. దీంతోపాటు పూలదండ, గంధపు చెక్క, అల్లం వంటివి దానం చేయవచ్ఛు
- 9వ రోజు - తొమ్మిదో రోజు అనంతుడిని పూజించాలి. పితృ దేవతలకు పిండ ప్రదానానికి విశేషమైన రోజుగా చెప్పబడుతోంది. దుప్పట్లు, కంబళి వంటి వాటిని దానమివ్వాలి.
- 10వ రోజు - నృశింహ స్వామిని పూజించడంతోపాటు పార్వతీ మంత్రాన్ని పఠించాలి. ఈరోజు రాగి చెంబు, గ్లాసు, తువ్వాలు, పుస్తకం వంటివి దానం చేయవచ్ఛు
- 11వ రోజు - వామనుడిని పూజించాలి. ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. అన్నదానం చేయాలి. గంధం, యజ్ఞోపవీతం, వస్త్రం దానం చేయాలి.
- 12వ రోజు - పుష్కరాల్లో చివరి రోజు శ్రీరాముడిని పూజించడంతోపాటు, రామనామాన్ని జపించాలి. ఈరోజు నువ్వులు దానం చేయడం పుణ్య కార్యంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పుష్కరాల చివరిరోజు షోడశ దానాలు, దశ దానాలు చేయాలని వేద పండితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ