తుంగభద్ర పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరగనున్న పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్ అరణ్య భవన్‌లో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్లు మంజూరుచేసినట్లు మంత్రి తెలిపారు. పనులన్నీ సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటుచేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు, బోట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.