పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ - l ramana to join in trs
15:20 June 07
పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
హుజూరాబాద్ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బలమైన బీసీ నేత కోసం తెరాస పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణను తెరాసలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపాను వీడి తెరాసలో చేరేందుకు ఆయన కూడా ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎల్.రమణతో పలుమార్లు ఫోన్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కూడా రమణతో చర్చలు జరిపినట్లు తెలిసింది.
ఎల్.రమణ సైతం పార్టీ మార్పు విషయంపై కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తెరాసతో పాటు భాజపా నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అయితే రమణ తెరాస వైపే కొంత మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని రమణ చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో అభిమానులు, సన్నిహితులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రి నుంచే కాకుండా సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే రమణ తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశముంది.