భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమల(Tirumala news today)లో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా తిరుమలకు వచ్చేందుకు భక్తులను తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం పునరుద్దరణను తితిదే చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్న తితిదే ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరించింది. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే వర్షాలు ఇంకా తగ్గుమఖం పట్టలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీస్తున్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు (Tirumala heavy rains) తిరుమల గిరుల్లో భయోత్పాతాన్ని సృష్టించాయి. ఫలితంగా శ్రీవారి సన్నిధికి చేరుకొనే మార్గాలన్నీ చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. కొండ పైనుంచి వచ్చిన వరద, పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. ఎంతో నాణ్యతతో, పటిష్టంగా ఉండే నడక మార్గం నిర్మాణం ఈ స్థాయిలో ధ్వంసమైందంటేనే... వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలంటే ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి ఆటంకం నెలకొంది.
కనుమదారుల్లో పెద్దఎత్తున కొండల పైనుంచి వరద నీరు జలపాతాలుగా పడుతుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు కూలాయి. కనుమదారిలో చాలాచోట్ల వరద నీరు నిలిచిపోయి...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.