సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు తిరుమలలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా మాఢ వీధుల్లో వాహన సేవలు నిర్వహించలేమన్నారు. కొవిడ్ ప్రభావం తగ్గితే అక్టోబర్లో మాఢవీధుల్లో ఉత్సవాలు జరుపుతామని వెల్లడించారు. తిరుపతిలో శనివారం నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈసారి ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తితిదే - తితిదే ధర్మకర్తల మండలి సమావేశం
ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయని.. వీటిని సెప్టెంబర్, అక్టోబర్లో నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో రేపటినుంచి సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బర్డ్ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు.. విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేశారు. తితిదే ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగుల వైద్య ఖర్చులు తితిదే భరించాలని నిర్ణయించారు.
తిరుమలలో వ్యర్థపదార్థాల నిర్వహణకు ఆధునిక పద్ధతుల కోసం విరాళాలు సేకరించనున్నట్లు వివరించారు. తితిదే బోర్డు మెంబర్ సుధానారాయణ మూర్తి రూ.కోటి విరాళం ఇచ్చారని తెలిపారు. గో సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని సమావేశంలో చర్చించామని.. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామివారి విరాళాల డిపాజిట్ విధానాలు మార్చాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.