శ్రీవారి విషయంలో ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. తితిదే భూములు అమ్మాలంటే కేవలం కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్మాలా? అని ప్రశ్నించారు. రాజకీయ వ్యతిరేకతతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న ఆస్తులనే గుర్తించి వేలం వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎన్నో విలువైన భూములను అమ్మేసిందని ఆరోపించారు. పదవిలో ఉన్నా.. లేకున్నా.. దేవుడి సొమ్ము ఆశించే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి, సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయని సుబ్బారెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం హయంలోనే..
తితిదేకి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి బాధ్యతగా ఖర్చు చేస్తామని... తిరుపతిలో గరుడ వారధికి గత ప్రభుత్వం తితిదే నిధులు ఖర్చు చేసిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదేలో అన్యాక్రాంతమైన, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల అమ్మకం కొత్తేం కాదని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలోనే భూముల అమ్మకం ప్రతిపాదన జరిగిందని గుర్తు చేశారు.