ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. సాధారణంగా ఆర్టీసీలో 8వేల 367 సొంత బస్సులు, 2వేల 103 అద్దె బస్సులు కలిపి మొత్తం 10వేల 460 ఉన్నాయని వివరించారు. ఈనెల 5 నుంచి ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె, ప్రైవేట్ వాహనాలు, మ్యాక్సీ క్యాబ్ లు కలిపి రోజుకు సుమారు 8వేల వాహనాలు నడుపుతున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 100 అద్దె బస్సులు పోలీసుల రక్షణతో ముఖ్యమైన రూట్లలో నడుస్తున్నాయని చెప్పారు.
తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టాం
తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడుపుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. డిపో మేనేజర్లు, ఆర్టీఏ అధికారులు లైసెన్సులు పరిశీలించి... డ్రైవింగ్ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక డ్రైవర్లను నియమించినట్లు చెప్పారు. అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత కండక్టర్లను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ వినతి మేరకు మెట్రో రైలు అదనపు ట్రిప్పులను నడిపిస్తోందని.. ప్రైవేట్ బస్సులను కూడా సమకూర్చామని చెప్పారు. ప్రైవేట్ వాహనాలు రోజుకు వంద రూపాయలు చెల్లించి స్టేజ్ క్యారియర్లుగా నడుపుకునేందుకు అనుమతిస్తూ ఈనెల 3న జీవో జారీ చేసినట్లు రవాణాశాఖ కార్యదర్శి తెలిపారు.