రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అన్ని డిపోల్లోనూ కార్మికులు దాదాపుగా విధులకు హాజరు కాలేదు. భద్రత నడుమ అధికారులు అద్దె బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి నడిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. ఆందోళనకు దిగిన కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.
శనివారం సాయంత్రం 6గంటల వరకు కార్మికులకు ప్రభుత్వ గడువు ఇచ్చింది. గడువులోపు మెుత్తం 160 మంది కార్మికులు విధుల్లో చేరారని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. హాజరైన వారిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు ఉన్నారని వెల్లడించింది,
ప్రయాణికులపై సమ్మె ప్రభావం
ప్రయాణికులపై ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎక్కువగా ప్రభావం చూపింది. బస్సుల కొరత కారణంగా వాహన దారులు అధిక ఛార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు రూ.300 ఛార్జీ ఉంటే రూ.600 వరకు వసూలు చేశారు. రెండు, మూడు రెట్ల రెట్టింపు ఛార్జీల వసూలుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం
ఎలాంటి గడువులకు బెదిరేదిలేదని... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఆదివారం ప్రతి బస్సు డిపో ఎదుట బతుకమ్మలతో నిరసనలు చేస్తామని ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద 16 మందితో నిరాహారదీక్ష చేస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.