తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చారా? - undefined

tsrtc strike

By

Published : Nov 11, 2019, 5:30 PM IST

17:15 November 11

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి సమర్పించింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. న్యాయస్థానం సూచన మేరకు రూ.47కోట్లు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. 

నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి అధ్యయనం చేస్తే రూ.2,209 కోట్ల దాకా తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా ఈ రూ.47 కోట్లు ఏ మూలకూ సరిపోవని ప్రభుత్వం నివేదికలో వివరించింది. 

మరోవైపు విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కావని హైకోర్టుకు అందజేసిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. 

సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి హైకోర్టుకు ఎలా ఉందో వివరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ఈ సందర్భంగా హైకోర్టు ప్రకటించింది.  

‘ఎస్మా’ జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా..

ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని ఆదేశిచింది. 

ఆర్టీసీని ప్రజాప్రయోజన సేవ(పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌)గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించగా.. ప్రజాప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. 

 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details