తెలంగాణ

telangana

ETV Bharat / city

Medaram Jatara 2022: మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు అదరహో.. - మేడారం జాతర

Medaram Jatara 2022: వనదేవతల చెంతకు భక్తులను చేర్చడానికి ఆర్టీసి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 4 వేల బస్సులను నడిపిస్తోంది. ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులను గద్దెల సమీపానికి చేర్చుతున్నారు. సాంకేతిక సోబగులు అద్దుకున్న ఆర్టీసీ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది.

TSRTC Special Services for Medaram Jatara 2022
TSRTC Special Services for Medaram Jatara 2022

By

Published : Feb 16, 2022, 3:52 PM IST

Medaram Jatara 2022: సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు ఆర్టీసీ సమాయాత్తమైంది. ఎండీ సజ్జనార్ నేతృత్వంలో 60 మంది ఆధికారుల బృందం మేడారం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ వద్దే బస చేసి ఆర్టీసీ సేవలను పర్యవేక్షిస్తున్నారు. 21 లక్షల మంది భక్తులను తరలించేలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4 వేల బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. ఇందుకోసం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ జంట నగరాల్లో మేడారం బస్సుల కోసం ప్రత్యేక తాత్కాలిక ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాల వారీగా ప్రత్యేకంగా బూతులు ఏర్పాటు చేసి.. భారీ క్యూలైన్లు నిర్మించారు. ప్రైవేటు వాహనాలను గద్దెలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే నిలిపి వేస్తుండగా.. ఆర్టీసీ బస్సులు మాత్రమే గద్దెల సమీపానికి భక్తులను చేరవేస్తున్నాయి.

భక్తుల కోసం ప్రత్యేక యాప్​..

భారీ సంఖ్యలో బస్సులు వస్తుండటంతో మరమ్మతులపైనా ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. తక్షణం మరమ్మతులు చేసేలా హన్మకొండ నుంచి మేడారం మార్గంలో మెకానిక్​లతో ప్రత్యేక జీపులను ఏర్పాటు చేశారు. బస్సుల్లో డీజిల్ నింపుకోవడానికి ఆరు చోట్ల బంకులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రయాణికులు, సిబ్బంది కోసం యాప్​ను సైతం రూపొందించింది. ఈ యాప్​లో బస్సుల సమాచారం, రిజర్వేషన్ సదుపాయం, సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, మ్యాప్ వంటి సదుపాయలు కల్పించింది. సిబ్బంది కోసం పార్కింగ్ ప్రదేశాలు, మెకానిక్ క్యాంపులు, అధికారుల ఫోన్ నంబర్లు, వైద్య సదుపాయం వివరాలు పొందుపరిచారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్​డేట్ చేయనున్నారు.

ఇంటికే అమ్మవారి ప్రసాదం..

ఆర్టీసీ ఈసారి తీసుకువచ్చిన మరో సదుపాయం.. కార్గో ద్వారా బంగారం అమ్మవార్లకు సమర్పించడం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బంగారాన్ని సంగ్రహించడానికి మేడారం బస్టాండ్​లో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని గద్దెల వద్దకు తరలించి అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. అనంతరం దేవాదాయ శాఖ సహకారంతో అమ్మవార్ల ప్రసాదంగా బెల్లం, కుంకుమ, పసుపు భక్తుల ఇళ్లకు చేర్చుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 5 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

సేవలపై భక్తుల సంతృప్తి..

ఆర్టీసీ ప్రత్యేక సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉందని అభిప్రాయపడుతున్నారు. మేడారం నుంచి చివరి ప్రయాణికున్ని తరలించే వరకు తమ సేవలు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details