TSRTC Requests Other states to hike bus charges : తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం.. ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
'మీరు కూడా ఛార్జీలు పెంచండి'.. ఇతర రాష్ట్రాలకు టీఎస్‌ఆర్టీసీ సర్క్యులర్
TSRTC Requests Other states to hike bus charges : తెలంగాణ ప్రజలపై ఆర్టీసీ మరోసారి పెనుభారం మోపింది. ఛార్జీల పెంచడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మళ్లీ నష్టాలు మూటగట్టుకునే ప్రమాదముందని భావించిన టీఎస్‌ఆర్టీసీ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాలను కూడా ఛార్జీలు పెంచాలని కోరింది.
Bus Charges hike in Telangana : అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు సర్క్యులర్‌లను పంపించినట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఛార్జీలు పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి నడిపించే బస్సు ఛార్జీల్లో వ్యత్యాసం ఉంది. టికెట్ ధర తక్కువ ఉండటంతో ప్రయాణికులు ఇతర రాష్ట్రాల బస్సులను ఆశ్రయిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ దృష్టికి వచ్చింది. దీంతో సర్క్యులర్ పంపించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి సైతం సర్క్యూలర్ పంపించారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్టు సమాచారం.