RTC Reduces Bus Fare: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం..
RTC Reduces Bus Fare: 'ప్రజల ఆదరణ - సంస్థకు ప్రేరణ'గా భావిస్తోన్న టీఎస్ఆర్టీసీ అందుకోసం ప్రయాణికులకు మరో తీపి కబురు వినిపించింది. బస్సు ఛార్జీలు పెంచడమే కానీ.. తగ్గించడం కుదరదు.. అనే మాటను తుడిచేస్తూ.. గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
TSRTC reduces prices on Garuda plus bus fares
By
Published : Feb 10, 2022, 10:53 PM IST
RTC Reduces Bus Fare:టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తోంది. సంస్థ బాగుతో పాటు ప్రయాణీకుల రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలంటే.. ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం పలు మార్లు అభిప్రాయపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఛార్జీలు పెంచడం అటుంచి తగ్గించి ప్రయాణికులకు ఆ సంస్థ తీపికబురు చెప్పింది. ఈ మేరకు గరుడ ప్లస్ బస్సుల ఛార్జీలు తగ్గిస్తూ.. టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తోన్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించినట్టు వెల్లడించారు.
రాజధాని ఛార్జీలతోనే గరుడ ప్లస్‌లో..
ప్రయాణీకుల సమస్యలపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వస్తోన్న సమస్యలు, సలహాలు, సూచనలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. అందులో భాగంగానే గరుడ ప్లస్ ఛార్జీలు తగ్గింపు నిర్ణయమన్నారు. రాజధాని ఛార్జీలతో గరుడ ప్లస్ బస్సులో ప్రజలు ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. సవరించిన ఛార్జీలు షెడ్యూల్, ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నట్లు పేర్కొన్నారు. అంతరాష్ట్ర సర్వీసులో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.