ఆర్టీసీ పార్శిల్ వ్యాపారంలోకి దిగనుంది. కార్గోతో పాటు పార్శిల్ సేవలను సొంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. రెండు సర్వీసులనూ శుక్రవారం అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టికెట్టేతర ఆదాయ వృద్ధికి పార్శిల్ వ్యవస్థను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు కార్గో వ్యవస్థకు రూపకల్పన చేశారు. తొలి దశలో 80 బస్సులను సిద్ధం చేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు బాలామృతం ఆహార పదార్థాలు, తదితరాలు రవాణా చేసేందుకు కార్గో బస్సులను వినియోగించారు. కార్గోతో సంబంధం లేకుండా తొలుత ఏఎన్‌ఎల్, ఆ తరవాత శ్రీసిద్ధార్థ ట్రేడర్స్‌తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుని కొన్నేళ్లుగా పార్శిల్ సర్వీసు నిర్వహిస్తోంది. ఇకనుంచి సొంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం పార్శిల్ సర్వీసు సేవలను అందిస్తున్న సంస్థ ఒప్పందాన్ని ఆర్టీసీ రద్దు చేసింది. ఇకనుంచి ఆ సంస్థ ద్వారా వచ్చే పార్శిళ్లు తీసుకోవద్దంటూ అన్ని డిపోల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్శిల్, కార్గో వ్యవహారాల పర్యవేక్షణకు రవాణా మంత్రికి ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణకాంత్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది.