తెలంగాణ

telangana

ETV Bharat / city

Sajjanar interview: అల్లు అర్జున్​కి నోటీసులేంటి? అసలేం జరిగింది?.. సజ్జనార్​తో స్పెషల్ ఇంటర్వ్యూ - sajjanar to allu arjun

ఇటీవల ఒక సంస్థ రూపొందించి ప్రచారం చేస్తున్న ప్రకటన ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను కించపరిచిందని యాజమాన్యం భావించింది. ఆ సంస్థకు.. ప్రకటనలో నటించిన నటుడు అల్లు అర్జున్​కు లీగల్ నోటీసులు పంపించింది. ఇంతకీ ఆ ప్రకటనలో అభ్యంతరకర అంశాలు ఏమున్నాయి...? నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ ఛార్జీలు ఎంతమేరకు పెంచబోతుంది..? తదితర ముఖ్యమైన అంశాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖీ.

Tsrtc MD Sajjanar Interview on allu arjun latest add against rtc
Tsrtc MD Sajjanar Interview on allu arjun latest add against rtc

By

Published : Nov 11, 2021, 5:16 AM IST

ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖీ

ప్రశ్న 1 : ఆ ప్రకటనలో ఏ అంశాలు అభ్యంతరంగా ఉన్నాయి...? వాటిపట్ల యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుంది...?

జవాబు :ఏ సంస్థ అయినా... తమ ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేసుకోవటంలో తప్పులేదు. కానీ.. అవతలి ఉత్పత్తులు బాగాలేవని చెప్పడం సరికాదు. తమ వాహనంలో ప్రయాణం చేస్తే.. వేగంగా వెళతారు. ఆర్టీసీ బస్సులో వెళితే ఆలస్యంగా వెళతారని చూపెట్టడం మంచి పద్ధతి కాదు. అది సరైన వ్యాపార వ్యూహం కూడా కాదు. ఇతర సంస్థను కించపరిచేవిధంగా వ్యాపారస్థులు కూడా ఆలోచన చేయొద్దు. అది మంచిపద్ధతి కూడా కాదు. అందుకే ఆ ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తంచేసింది. గూగుల్ వాళ్లు దాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ సంస్థకు, అందులో నటించిన అల్లు అర్జున్​కు లీగల్ నోటీసులు ఇచ్చాం. సెలబ్రిటీలు ప్రజల ఆలోచనలు మార్చేవిధంగా ఉంటారు. వాళ్లు చెబితే నలుగురు వింటారు. సెలబ్రీటీలు కూడా ఆలోచించాలి. డబ్బులు వస్తున్నాయి కదా... అని ఏదో మాట్లాడితే సరికాదు. అనేక దశాబ్దాలుగా ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. అటువంటి సంస్థపై ఇలాంటి ప్రకటనలు చేయొద్దు. కోవిడ్ తర్వాత ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నిన్న ఒక్కరోజే రూ.14 కోట్ల ఆదాయం వచ్చింది. 37 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాము. మంచి ఆదరణ వస్తున్న సమయంలో ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఇప్పటికే ప్రయాణికులు, అధికారులు, ఉద్యోగుల నుంచి ప్రకటనపై వ్యతిరేకత వస్తుంది. దీంతో సదరు సంస్థకు లీగల్ నోటీసులు పంపించాల్సి వచ్చింది.

ప్రశ్న2 : లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన రూపొందించిన వారి నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా...? మరోవైపు ప్రకటన యదావిధిగా కొనసాగుతుంది...దానిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా... ?

జవాబు :ఇప్పటికే దాన్ని ప్రచారం చేస్తున్న గూగుల్ సంస్థతో నేనే స్వయంగా మాట్లాడాను. మెయిల్ కూడా పంపించాను. వాళ్లు కొంత టైమ్ అడిగారు. ఆ లోపు దాన్ని తొలగించకపోతే కోర్టుకు కూడా వెళ్తాం.

ప్రశ్న 3 : బస్సులు సరైన సమయంలో నడపాలని ప్రయాణికుల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు..?

జవాబు :ఇప్పటికే అధికారులకు ఆర్టీసీ బస్సుల సమయపాలనపై పలు సూచనలు ఇచ్చాం. ఇంకా కొంత సాంకేతికత కూడా వాడాల్సిన అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్క బస్సులో ఆ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా బస్సు ఎక్కడ ఉంది... ఎప్పుడొస్తుంది అని తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ప్రశ్న 4 : ఇటీవలి కాలంలో మీరు ఒంటరిగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో తిరిగారు. బస్టాండ్​లను, బస్​ డిపోలను సందర్శించారు. ప్రయాణికుల నుంచి ఎటువంటి విజ్ఞప్తులు.. సూచనలు, సలహాలు వచ్చాయి..?

జవాబు : ప్రయాణికుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. డ్రైవర్లకు, కండక్టర్లకు అందరికి వందశాతం వ్యాక్సిన్ వేయించాం. ప్రజలు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. కొన్ని చోట్ల బస్సులు సమయానికి రావడంలేదని చెబుతున్నారు. వాటికి సంబంధించి స్థానిక డీఎంలకు ఆదేశాలు జారీచేశాం. ఏ ఫిర్యాదు వచ్చినా.. వెంటనే స్పందించి బస్సులను పంపించండి అని చెప్పాం. ఆక్యుపెన్సీ వస్తే నడిపించండి. లేదంటే.. ఆ బస్సులను రద్దు చేయవచ్చని చెప్పాం. ప్రజలు కోరుతున్నారు. వారు కోరినప్పుడు బస్సు పంపుతున్నాం... ప్రజలు కూడా స్పందించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి. అయినప్పటికీ.. సామాన్య మానవులను దృష్టిలో పెట్టుకుని బస్సులను నడుపుతున్నాం.

ప్రశ్న 5 : ఆర్టీసీ బస్సులకు అంటించే ప్రకటనలు తొలగిస్తున్నారు. భవిష్యత్​లో ఆర్టీసీ బస్సులపై ప్రకటనలు చూసే అవకాశం ఉండదా..? దానివల్ల వచ్చే ఆదాయం కోల్పోవడం వల్ల ఆర్టీసీకి నష్టమేకదా...?

జవాబు : ఆర్టీసీ బస్సులపై అంటించే ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. టికెట్​పై వచ్చే ఆదాయమే ప్రధానమైంది. ఆ విధంగా తక్కువగా వచ్చే ఆదాయంతో మహిళలను, పిల్లలను కించపరిచేవిధంగా అసభ్యకరమైన పోస్టర్లు, ప్రకటనలు కావచ్చు.. అటువంటివి అవసరం లేదని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. కొందరు అధికారులు కూడా ప్రకటనలు తొలగించడం ద్వారా కొంత ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందని నా దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ.. అటువంటి ప్రకటనలు వద్దు అని అధికారులకు స్పష్టం చేశాం.

ప్రశ్న 6: గత మూడేళ్లలో ఆర్టీసీకీ నాలుగువేల కోట్ల పైచిలుకు నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు పూడ్చుకునేందుకు ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ధరలు పెంచాలని సమావేశం నిర్వహించారు. టికెట్ ధరలు ఎంత పెంచితే ఆర్టీసీకి కలిసి వస్తుంది. ప్రయాణికులపై అధిక భారం పడకుండా ఉంటుందని సంస్థ భావిస్తోంది..?

జవాబు : 30శాతం డీజీల్ ధరలు పెరిగాయి. స్పేర్ పార్ట్స్ ధరలు కూడా పెరిగాయి. బస్సు సర్వీసులు కూడా పెరిగాయి. ఇవన్నీ కలిపితే 30శాతం ఖర్చులు పెరిగాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాం. సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఛార్జీలు ఎంత పెంచాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే ఛార్జీలు పెంచడం జరుగుతుంది.

ప్రశ్న 7: ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు..?

జవాబు :ఆర్టీసీ బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాం. శానిటైజేషన్ చేస్తున్నాం. డ్రైవర్లు, కండక్టర్లకు వందశాతం వ్యాక్సినేషన్ చేయించాం. ప్రజలందరూ ఆర్టీసీని ఆదరించండి. తరతరాల నుంచి ఆర్టీసీకి మంచి ఆదరణ ఉండేది. కొవిడ్ వల్ల అది తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటుంది. ప్రయాణికులు ఆదరిస్తేనే సంస్థ గట్టెక్కుతుంది. సురక్షితమైన ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details