హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికశాఖ కమిషనర్ వద్ద ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి విధుల్లో చేరతామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుందంటూనే మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారని అన్నారు.
చట్ట ప్రకారం కుదరదు
ఇష్టారీతిన విధులకు గైర్హాజరై మళ్లీ ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరడం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉండదని ఎండీ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప... యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ సమ్మె చేయమని చెప్పలేదని అన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని ఆక్షేపించారు. చట్టవిరుద్ధమైన సమ్మెలో ఉండి ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని అన్నారు.
యూనియన్ల మాట విని నష్టపోయారు
రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం చెప్పిన ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారని... అందుకు అనుగుణంగానే యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని పేర్కొన్నారు. ఇక ముందు కూడా వారి మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని సూచించారు.
శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు
రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని... బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని ఎండీ కోరారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం క్షమించబోదని హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలుపుతామని చెప్పారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం కార్మికశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని ఆర్డీసీ ఎండీ సునీల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ