రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్ వైజర్లు ఇలా అనేక రకాల విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బస్సులు పూర్తిస్థాయిలో నడవకపోవడంతో ఉద్యోగులను పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోవడం లేదు. పనిచేసిన వారికి పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు. రూ.వందలోపు, రూ.వెయ్యి లోపు జీతం వచ్చిన ఉద్యోగులూ ఉన్నారు. ఇక నాలుగు వేల నుంచి ఐదు వేల లోపు జీతం వచ్చిన వారు ఎక్కువ శాతం ఉన్నారు. భద్రాచలం డిపోలో ఓ ఉద్యోగికి కేవలం 77 రూపాయలు మాత్రమే వచ్చింది. ఇదే డిపోలో మరో ఉద్యోగికి రూ.999 మాత్రమే వచ్చాయి. ఒక కార్మికుడికి కేవలం రూ.57 మాత్రమే వచ్చాయి. ఒక ఉద్యోగికి కేవలం 7 రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలా బతికేది
ఈ జీతాలతో తాము ఎలా బతకాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీటితో ఇంటి అద్దె ఎలా కట్టాలి, నిత్యావసర సరుకులు ఎలా కొనుగోలు చేయాలి... ఇప్పుటికే పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. పిల్లల పాఠశాల ఫీజులు ఏవిధంగా కట్టాలి... అని ఆర్టీసీ ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మే 19నుంచి నడుస్తున్నాయి. సీట్ల నిండా ప్రయాణికులను ఎక్కించుకోవాలన్న నిబంధనల వల్ల కరోనా సోకే ప్రమాదమున్నా... ఆర్టీసీ సిబ్బంది తగు రక్షణ చర్యలు తీసుకుని ప్రజల్లో సంస్థ పట్ల నమ్మకం కల్గించేలా విధులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డిపోల్లో డ్యూటీకీ రిపోర్టు చేసినప్పటికీ... డ్యూటీ దొరకని సిబ్బందిని సెలవు తీసుకోమని చెప్తున్నారని ఆర్టీసీ కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఆరోజు ఆబ్సెంట్‌గా మార్క్ వేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు.