లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు చవిచూసింది. రోజుకి 11 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఉన్న ఆదాయం.... ఒక్కసారిగా 50లక్షలకు పడిపోయింది. అదే సమయంలో ఆర్టీసీ కార్గో, పార్శిల్, కొరియర్ సర్వీసులు మాత్రం ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో.. ఎక్కువ మంది ఆర్టీసీ సర్వీసులపైనే ఆధారపడ్డారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, వస్తువులు చేరవేయడం వంటివి ఎక్కువగా... ఆర్టీసీ ద్వారానే జరిగినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ విరామ సమయంలో ఆర్టీసీ బస్సులు నడవడంతో... ఖచ్చితంగా గమ్యస్థానాలకు బస్సులు వెళ్తాయి... పార్శిళ్లను కూడా తీసుకెళతాయనే నమ్మకమే తమ ఆదాయాన్ని పెంచిందని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత ఏడాది జూన్ 19న ఆర్టీసీ పార్శిల్స్ సేవలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. 147 బస్ స్టేషన్లలో ఏర్పాటైన ఈ సేవలు... సంస్థ బస్సుల ద్వారా వినియోగదారులకు వేగంగా సురక్షితంగా, చేరువగా పార్శిల్స్ చేరవేసే లక్ష్యంతో... అదనంగా ఉన్న ఉద్యోగులతో పాటు.. సంస్థ నియమించిన 610 ఏజెంట్లతో ఆర్టీసీ సేవల్ని అందిస్తోంది. లాక్ డౌన్ సమయంలో... మార్చి 24న కార్గో సేవల్ని ప్రారంభించారు. సుమారు 9 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్న 150 ఆర్టీసీ బస్సులను కార్గో రవాణా వాహనాలుగా రూపొందించారు.