TSPSC OTR : రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న ఉద్యోగార్థుల స్థానిక జిల్లా, జోన్లలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీఎస్‌పీఎస్సీ వద్ద వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కింద నమోదైన 25 లక్షల మంది ఉద్యోగార్థులకు సంబంధించి స్థానికత వివరాలు సరిచేయాల్సి ఉంది. 2018లో కొత్త ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు వెలువడగా అంతకు ముందుతో పోల్చితే స్థానికత నిర్వచనం మారింది. దాంతో ఆ మేరకు సొంత జిల్లాలు మారనున్నాయి. 2018కి ముందు నాలుగు నుంచి పదివరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే దానిని స్థానిక జిల్లాగా గుర్తించారు. ఇప్పుడు ఒకటి నుంచి ఏడు వరకు వరుసగా నాలుగేళ్లు ఏజిల్లాలో చదివితే దానిని స్థానికతగా నిర్ణయిస్తున్నారు. ఈ లెక్కన అభ్యర్థుల స్థానికత మారే అవకాశముంది. ఈ మేరకు ఉద్యోగార్థులు వారు గతంలో ఎక్కడ చదివారో ఆ పాఠశాలల నుంచి బోనాఫైడ్ (స్టడీ సర్టిఫికెట్) తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పాఠశాలలు మూసివేయడంతో ఆందోళన చెందుతున్నారు.
ఓటీఆర్‌లో మార్పులు ఎలా?
ఉద్యోగార్థులు ప్రతి నియామక నోటిఫికేషన్‌కు పదేపదే వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా టీఎస్‌పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని తెచ్చింది. ఇందులో అభ్యర్థి స్థానికత, జోన్ తదితర వివరాలన్నీ ఉంటాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఉద్యోగార్థుల సమాచారాన్ని సరిచేయాలని కమిషన్ భావిస్తోంది. సాఫ్ట్‌వేర్ సహాయంతో సవరించాలా? వ్యక్తిగతంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి సరిచేయాలా అనే విషయాల్ని పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులో సాంకేతిక ఇబ్బందులను అధిగమించవచ్చని భావిస్తోంది. మరోవైపు నాలుగేళ్లుగా ఉద్యోగ విపణిలోకి కొత్తగా వచ్చిన యువత కమిషన్ వద్ద పేర్ల నమోదుకు ఎదురుచూస్తోంది.