Tsafrc: తెలంగాణలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజల ఖరారులో ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ టీఎస్ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. ఈమేరకు ఏఐసీటీఈకి లేఖ రాసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్, ప్లానింగ్, లా, ఫార్మాలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, డీఎడ్ కోర్సుల ఫీజులపై మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది.
గత రుసుములను ఖరారు చేసి మూడేళ్లయినందున రానున్న మూడేళ్ల కోసం గతేడాది నవంబరు29న సమీక్ష ప్రక్రియను ప్రారంభించారు. ఫీజులను సమీక్షించేందుకు 2020-21 విద్యా సంవత్సరం ఆదాయ, వ్యయ వివరాలను సమర్పించాలని వృత్తి విద్య కళాశాలలకు సూచించింది. కళాశాలలు ఆదాయ, వ్యయాలు, ఇతర నివేదికలను ఏఎఫ్ఆర్సీకి సమర్పించాయి. టీఎస్ఏఎఫ్ఆర్సీ మే16 నుంచి రోజుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలను పిలిపించి విచారణ ప్రక్రియ చేపట్టింది. అయితే కనిష్ఠ, గరిష్ఠ ఫీజులను ఖరారు చేస్తూ మే19న ఏఐసీటీఈ నుంచి తాజా మార్గదర్శకాలు వచ్చాయి.
ఫీజులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కేంద్ర విద్యా శాఖ ఆమోదించిందని అందులో పేర్కొంది. ఫలితంగా ఇంజినీరింగ్ కు కనీసం రూ.79,600 గరిష్ఠంగా రూ.లక్షా 89 వేల 800లు.. ఎంబీఏకు కనీసం రూ.85వేలు గరిష్ఠంగా రూ.లక్షా 95 వేల 200 ఉండాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీస రుసుము రూ.35 వేలు గరిష్ఠంగా రూ.లక్ష 34వేలుగా ఉంది. రానున్న మూడేళ్లకు కూడా ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలు చాలని కొన్ని గ్రామీణ ప్రాంత కాలేజీలు ఇప్పటికే ఏఎఫ్ఆర్సీని కోరాయి.