Basthi dawakhana: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు.. బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తోంది. ఇవాళ మరో 32 దవాఖానాలను మంత్రులు ప్రారంభించారు. గోషామహల్ నియోజకవర్గపరిధిలోని దూల్‌పేట చంద్రకిరణ్ బస్తీలో దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఖైరతాబాద్ మహాభారత్‌నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.
మొత్తం 258 బస్తీ దవాఖానాలు..
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ప్రారంభించిన 32 బస్తీ దవాఖానాలతో కలిపి మొత్తం సంఖ్య 258కి చేరింది. బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం రోజుకు సుమారు 25 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన వాటితో మరో 5 వేలమందికి వైద్య సేవలు అందనున్నాయి.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మొత్తం 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టికి 258 అందుబాటులోకి రాగా... ఇంకా 7 బస్తీ దవాఖానాల పనులు జరుగుతున్నాయి. 35 బస్తీ దవాఖానాలకు సంబంధించిన స్థల అన్వేషణ జరుగుతోంది. వీటితో పాటు మరో 50కి సంబంధించి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభం..
Basthi dawakhanas in hyderabad: ఇవాళ లలితాబాగ్, రియసాత్నగర్, కంచన్‌బాగ్, నవాబ్‌సాహెబ్‌కుంట, రామ్నాస్పుర, టోలిచౌకీ, పురానాపూల్, రెయిన్‌బజార్, ఖైరతాబాద్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ సింగడి బస్తీ కమ్యూనిటీ హాల్, గోషామహల్ దూల్పేట్ చంద్రకిరణ్ బస్తీ కమ్యూనిటీ హాల్, మల్లేపల్లి జకీర్ హుస్సేన్ కమ్యూనిటీ హాల్, గోల్నాక కమగారినగర్ కమ్యూనిటీ హాల్, యూసఫ్ గూడ కమ్యూనిటీహాల్, బన్సిలాల్‌పేట్ హమాలీ బస్తీ కమ్యూనిటీ హాల్, నాచారం అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్, చిలుకానగర్ కమ్యూనిటీ హాల్, అబ్సిగూడ రామంతపూర్ జడ్పీహెచ్ స్కూల్, ఓల్డ్ బోయిన్పల్లి వార్డు ఆఫీస్, ఫిరోజ్‌గూడ వార్డు ఆఫీస్, చింతల్ ఎన్ఎల్బీ కమ్యూనిటీహాల్, సుభాష్‌నగర్ అపురూప కాలనీ కమ్యూనిటీహాల్, మచ్చబొల్లారం కౌకూర్మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర, వెంకటాపురం గోకుల్ నగర్ పార్కు, నేరెడ్మెట్ చెక్‌పోస్ట్ కమ్యూనిటీ హాల్ యాప్రాల్, గౌతంనగర్ ఓల్డ్ మిర్జల్‌గూడ శ్రీనివాసనగర్ కమ్యూనిటీహాల్, హైదర్నగర్వార్డు ఆఫీస్, హైదర్‌గూడ, శేరిలింగంపల్లి ముస్లీం బస్తీ, నెహ్రునగర్ కమ్యూనిటీహాల్, చందానగర్ పాపిరెడ్డి కమ్యూనిటీహాళ్లలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.
బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు...
ఈ బస్తీ దవాఖానాల్లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇవే కాకుండా నగరంలో 85 అర్బన్ హెల్త్ సెంటర్లూ వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడం సహా బీపీ, షుగర్‌తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. ఇక్కడ సేకరించిన నమూనాలను తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారు.
ఇదీచూడండి:Harish Rao on Omicron: 'ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం'