వలస కార్మికుల రవాణాతోపాటు ఆశ్రయం, ఆహారం అందించడానికి చేసిన ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వేకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదో చెప్పాలని పేర్కొంది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను తరలించడానికి ఏర్పాట్లు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ లెక్చరర్ ఎస్.జీవన్ కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల తరలింపునకు సంబంధించి నివేదిక ఏదని ప్రశ్నించగా అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ సమాధానమిస్తూ దాఖలు చేశామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.
పరిస్థితి దుర్భరంగా ఉంది..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 3వేల మంది ఇటుక బట్టీల కార్మికులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారన్నారు. జూన్ 1 నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోందని బీహార్‌కు ఒక్క రైలు మాత్రమే నడిపిందని, 24 బోగీలు కిక్కిరిసి వెళ్లిందన్నారు. కార్మికులు టిక్కెట్లు తీసుకున్నాక వారం రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైల్వేకానీ, ప్రభుత్వంగానీ కార్మికులకు ఆశ్రయం, ఆహారం ఏర్పాట్లు చేయలేదని, మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితి దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.