OMC CASE: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు మైనింగ్ లీజులు మంజూరు చేసిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ వై.శ్రీలక్ష్మి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. ఆమెపై నిర్దిష్ట ఆరోపణలున్నాయని వివరించింది. ప్రాథమికంగా నిందితుల పాత్రను కోర్టులు తేల్చాల్సి ఉందని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలను ఇచ్చినట్లు ఆమె నిరూపించుకోవాల్సి ఉందని ఆదేశించింది. జీవోలో క్యాప్టివ్ మైనింగ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది నిర్ధారించడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది. కింది కోర్టు విచారించినప్పుడు తనకు రక్షణగా ఉన్న అన్ని అంశాలను వినియోగించుకోవచ్చని సూచిస్తూ శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసింది.
ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతోపాటు పరిహారం ఇప్పించాలంటూ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి 2015లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పునిచ్చారు. మైనింగ్ లీజులు కేంద్రం పరిధిలోనివని, ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఓఎంసీకి లీజులు మంజూరు చేయాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపినట్లుందని వివరించారు. తిరస్కరించిన దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి.. వారి అభ్యర్థనలను విన్నాక నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 409 తనకు వర్తించబోదని పిటిషనర్ చెప్పజాలరని వివరించారు. కేసులో పిటిషనర్ పాత్ర విచారణార్హమైనదని అన్నారు.
మరిది ఆస్తులు కూడబెట్టారు..
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి), 13(2) తమకు వర్తించబోవని, దానికి సంబంధించిన ఎలాంటి ఆరోపణలు లేవన్న పిటిషనర్ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. శ్రీలక్ష్మి ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె మరిది ఎం.రాకేష్‌బాబు ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమైన ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. దీనిపై కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఓఎంసీపీఎల్, బీఐఓపీఎల్‌తోపాటు ఇతర కంపెనీల సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్ మాత్రమే విచారించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని.. అంతకుముందున్న లీజుల వ్యవహారాల్లోకి వెళ్లరాదన్న శ్రీలక్ష్మి వాదనతో ఏకీభవించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్రమ లీజులతోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, దీనిపై దర్యాప్తు పరిధి సీబీఐకి ఉందని వివరించారు.