రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది గడిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చేర్పించినప్పుడు ఎన్నో సందేహాలు, భయాలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. ఏడాది కాలంగా వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, కరోనా చికిత్సలో అనుభవం సంపాదించారన్నారు.
గాంధీ ఆస్పత్రిలో సుమారు 35 వేల మంది కరోనా బాధితులకు చికిత్స చేసినట్లు ఈటల చెప్పారు. అందులో సుమారు 7 వేల మందిని అత్యవసర విభాగంలో ఉంచి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా కరోనా సోకిన గర్భిణీలకు గాంధీ వైద్యులు ప్రసవం చేశారని కొనియాడారు.