వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో అర్హులను గుర్తించి వీలైనంత త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆదేశించింది. అందుకు అనుగుణంగా కొత్త లబ్ధిదారుల ఎంపిక కసరత్తును గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ప్రారంభించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ - తెలంగాణలో ఆసరా పింఛన్ల వార్తలు
13:16 August 14
నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
57 ఏళ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కోసం మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమానాలోని దరఖాస్తు పత్రంలో పేరు, వివరాలు, ఆధార్ సంఖ్య, అందులోని పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ పేర్కొనాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును కూడా జతపర్చాల్సి ఉంటుంది. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం నెలాఖరు వరకు గడువిచ్చింది.
పుట్టినతేదీ, విద్యా సంబంధిత ధ్రువపత్రాలు, ఓటరు గుర్తింపు కార్డు, ఓటర్ల జాబితానూ వయస్సు నిర్ధరణ కోసం పరిగణలోకి తీసుకోనున్నారు. పింఛన్ల కోసం దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని... తక్షణమే స్వీకరించేలా అన్ని సేవా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అటు దరఖాస్తు దారుల నుంచి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయరాదని మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని దరఖాస్తులకు సంబంధించిన సేవా రుసుమును ఈ-సేవకు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. దరఖాస్తులన్నీ అందాక వాటి పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను విడిగా జారీ చేయనున్నారు.
ఇదీచూడండి:పింఛను పాలసీ తీసుకుంటున్నారా?