తెలంగాణ

telangana

ETV Bharat / city

రైసు మిల్లుల సంఖ్య, సామర్థ్యం పెంపుపై రాష్ట్ర సర్కారు దృష్టి - Rice mills Expansion updates

రైసు మిల్లుల సంఖ్య, సామర్థ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వరి ధాన్యం సాగు, దిగుబడి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేలా కసరత్తు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమైన సర్కార్... రైసు మిల్లుల విషయమై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఆధునిక యంత్రాల సహాయంతో ఎక్కువ సామర్థ్యంతో మిల్లింగ్ చేసేలా ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నారు.

ts government focus on Rice mills Expansion
ts government focus on Rice mills Expansion

By

Published : Aug 22, 2021, 4:25 AM IST

Updated : Aug 22, 2021, 6:34 AM IST

రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. సమృద్ధిగా సాగునీరు లభిస్తోండడంతో వరి సాగు గణనీయంగా పెరుగుతోంది. ఏటా, ప్రతి సీజన్‌కు రాష్ట్రంలో వరిపంట సాగు, దిగుబడి పెరుగుతోంది. భారత ఆహారసంస్థకు అత్యధికంగా బియ్యాన్ని అందిస్తోంది. అయితే మిల్లింగ్ సామర్థ్యం అందుకు తగ్గట్లుగా పెరగకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా మిల్లుల వద్ద వడ్లు పేరుకుపోతున్నాయి. కొనుగోళ్ల సమయంలో వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కృషి చేస్తోంది. ఈ విషయమై అధికారులు, రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే చర్చించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై ఫోకస్​...

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకొచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. 500 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగ జోన్లు అభివృద్ధి చేయాలని... ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మొదటి దశలో హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

జపాన్​ కంపెనీ యంత్రాల పరిశీలన..

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ఇప్పటికే టీఎస్ఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ స్వీకరించారు. దాదాపుగా 1500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో ఎక్కువగా రైసు మిల్లులకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఈ తరహా దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొత్త మిల్లుల కోసం ప్రతిపాదనలతో పాటు ఇప్పటికే మిల్లులు ఉన్నవారు విస్తరణ కోసం ఆసక్తి చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం పెంచాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... ఇందుకోసం అత్యాధునిక యంత్రాలను వినియోగించుకోవాలని భావిస్తోంది. జపాన్ కు చెందిన సటాకి కంపెనీకి చెందిన ఈ తరహా యంత్రాలను పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, అధికారుల బృందం కర్నాటకలోని రాయచూర్ లో పరిశీలించింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తాన్ని మిల్లింగ్ చేయడం వీటి ప్రత్యేకతగా చెప్తున్నారు. బియ్యంతో పాటు వచ్చే తవుడు, పరం లాంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని... వృథాకు ఆస్కారం ఉండదని అంటున్నారు.

సటాకి కంపెనీతో సంప్రదింపులు..

సటాకి కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కంపెనీ ప్రతినిధులు ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే రైస్ మిల్లుల సంఖ్య, సామర్థ్యం పెంపుపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మిల్లింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్న, సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మొదట ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

ఐదో రోజు రైతుల ఖాతాల్లో రూ.36.29 కోట్ల జమ

Last Updated : Aug 22, 2021, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details