Stamps and Registration: రాష్ట్రంలో కొవిడ్ కారణంగా ఈ ఆర్థిక ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాబడి రాలేదు. స్వల్పంగా రూ.136 కోట్లు ఆదాయం తగ్గి రూ.12,500 కోట్లకు బదులు... రూ.12,364 కోట్లు వచ్చింది. ఈ రాబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆల్ టైం రికార్డు. గతంలో ఎన్నడూ లేనంత అధికంగా వచ్చింది. 2021- 22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కొవిడ్ మూలంగా రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గినా... ఆ తర్వాత తొమ్మిది నెలల్లో ఆదాయం అనూహ్యంగా పెరిగింది.
కొవిడ్ ఎఫెక్ట్: 2018- 19 ఆర్థిక ఏడాదిలో 15.2 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.6,612.74 కోట్లు ఆదాయం వచ్చింది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 16.59 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.7,061 కోట్లు రాబడి వచ్చింది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో 10వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే కొవిడ్ ప్రభావం అన్ని వ్యవస్థలపై పడటంతో రిజిస్ట్రేషన్ల శాఖపై కూడా తీవ్రంగా పడింది. దీంతో 2020- 21 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గి 12.11 లక్షలకు పడిపోయి తద్వారా కేవలం రూ.5,260.20 కోట్లు ఆదాయం వచ్చింది. అయినా ఈ ఆర్థిక సంవత్సరం 2021- 22లో రూ.12,500 కోట్లు రాబడి వస్తుందని అంచనాతో లక్ష్యంగా నిర్దేశించింది.
పుంజుకున్న రాబడులు:రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడంతోపాటు... వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచడంతో నెలకు ఆరేడు వందల కోట్లు రాబడి వచ్చేది కాస్త ఏకంగా రెట్టింపునకు ఆదాయం పెరిగింది. మొదటి మూడు నెలలు ఆదాయం పడిపోయినా ఆ తరువాత నెలకు సగటున 1000 కోట్లకు తక్కువ లేకుండా రూ.1,501 కోట్ల వరకు రాబడి వచ్చింది. దీంతో 19.87 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన లక్ష్యానికి దాదాపు చేరుకుంది.