శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారమే కీలక ఆయుధం. నేరం ఎలా జరిగిందనే విషయాలపై వారు అధ్యయనం చేస్తారు. ఘటనాస్థలం పరిశీలించి ఆధారాలు సేకరిస్తారు. పాత నేరస్థుల జాబితాతో పోల్చి నిందితులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి వారం రోజులు పడుతోంది. అయితే.. ఈ సమస్త సమాచారం క్షణాల్లో ఘటనా స్థలంలో ఉన్న పోలీసులకు చేరవేసేలా టీఎస్ కాప్ యాప్ రూపొందించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరాలు, నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో పొందుపర్చారు. దొరికిన ఆధారాలతో అనుమానితులను పోల్చేలా చర్యలు చేపట్టారు.
టీఎస్ కాప్ యాప్ పోలీసుల నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలన్నీ ఇందులో చూడవచ్చు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానం చేశారు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన సమాచారం తెలుసుకునే సదుపాయం కల్పించారు. నేరాలు జరిగే ప్రాంతాలు, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ టవర్లను జియో ట్యాగింగ్ చేసి సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నారు.
టీఎస్ కాప్ యాప్ పనితీరు తెలుసుకోవటానికి ఇటీవల కొన్ని కేసులు అద్ధం పడుతున్నాయి. హైదరాబాద్ బేగంబజార్‌లోని ఓ బంగారం దుకాణంలో జరిగిన దోపిడీని పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. దుకాణం వద్ద ఉండే కాపాలాదారుడిని కట్టేసిన దొంగలు అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేరస్థులతోపాటు వారు వచ్చిన వాహనం దృశ్యాలను సేకరించారు. జియోట్యాగింగ్ ద్వారా సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
ఇక పోలీసు స్టేషన్ల పరిధిలో సెక్టార్ల వారీగా నేరాలు జరుగుతున్న ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేస్తారు. ఎక్కడెక్కడా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో గుర్తిస్తున్నారు. ఆ సమాచారాన్ని గస్తీ నిర్వహించే సిబ్బంది ట్యాబ్‌లోని టీఎస్ కాప్ యాప్‌లో కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచుతున్నారు. విచారణలో భాగంగా అనుమానితుడికి సంబంధించిన ఫోన్ నెంబర్, వాహనం నెంబరు, గుర్తింపు కార్డులాంటి ఏ ఒక్కటి దొరికినా... దాని ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల పోలీసులు టీఎస్ కాప్ లాంటి యాప్ ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక బృందాలు పర్యటించి యాప్ పనితీరు తెలుసుకున్నాయి.