రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారాలంటే.. పంటల సాగుపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల అవసరాలకు తగినట్లు సాగుచేసేలా సర్కారు సూచనలు చేయాలని సలహా ఇచ్చారు. రైతులు ఎవరికి ఇష్టమెచ్చినట్లు వారు పంటలు పండించకుండా.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు తీసుకోవాలన్నారు. సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, నియంత్రిత సాగు విధానం, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడం వంటి అంశాలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష జరిగింది.
లాభసాటి సాగుపై సమాలోచనలు
రాష్ట్రంలో సాగు లాభసాటిగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యలను వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట పండించాలనే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని, దానికి అనుగుణంగా సాగుచేసేట్లు చూడడం అత్యంత ప్రధానమని వారు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ప్రస్తుతం ఉందని, అలా చేయడం వల్ల పండించిన పంటకు మంచి ధర రాదన్నారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటలు పండించాలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచించారు. సాగు పూర్తిగా నియంత్రిత విధానంలోకి రావాలని, దీనిపై రైతుల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. వ్యవసాయాధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం, పరిశోధన చేసి ఎక్కడ ఏ పంట ఎంత మేర సాగు చేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని నిలిపివేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలను ఉల్లంఘించి సాగుచేసిన వారి పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే..
ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలని పేర్కొన్నారు. ఈసారి కరోనా- లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోందన్నారు. ఏటా కొనుగోలు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదని పేర్కొంది. ఇందువల్ల మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరోమార్గం లేదని వారు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలనే విషయంలో ఇప్పటికే కొంత నిర్ధరణకు వచ్చారు.
ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 80-90 లక్షల ఎకరాలు, పత్తి 50 లక్షల ఎకరాలు, కంది 10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 7 లక్షల ఎకరాలు, వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాలు, మిర్చి రెండున్నర లక్షల ఎకరాలు, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాలు, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాలు, పసుపు 1.25 లక్షల ఎకరాలు, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు పంటలు మరో రెండు లక్షల ఎకరాలు, కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం ఉత్తమమని లెక్కలు వెల్లడించారు.
పామాయిల్ సాగుపై..