రాష్ట్రంలో నదీ పరీవాహకం, అటవీ ప్రాంతాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఆదివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన మావోయిస్టుల ప్రభావిత ప్రాంత రాష్ట్రాల సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదరిక నిర్మూలన, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతున్నామని తెలిపారు. యువతతోపాటు, అన్నివర్గాలకూ.. రాష్ట్ర ప్రభుత్వం చేదోడుగా ఉంటోందని వెల్లడించారు.
రోడ్ల అనుసంధానం వేగవంతం చేయాలి..
వ్యవసాయ, సాగునీటి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని.. రోడ్ల అనుసంధానం వేగవంతం చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది, అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న అన్ని పల్లెలకూ రహదారులు నిర్మించడం సహా.. వీలైనన్ని చోట్ల నదిపై వంతెనలు నిర్మించేందుకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన, అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఆ ప్రాంతాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయాలని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని కోరారు.
కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోండి..
అనంతరం కేంద్ర ఆహార, ప్రజాపంపిణి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr meet union minister piyush goyal) సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు సాగిన ఆ సమావేశంలో రాష్ట్రంలో భారీగా పేరుకున్న ఉప్పుడు బియ్యాన్ని... కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేంద్రం 24.75 లక్షల మెట్రిక్ టన్నులనే తీసుకుంటానని చెప్పిది. రాష్ట్రం కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కోరుతోంది. గత దిల్లీ పర్యటనలోనూ ముఖ్యమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి.. ఇదే విషయాన్ని సీఎం విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్.. పీయూష్ గోయల్‌ను కలిశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందువల్ల కేంద్రం సాయం చేయాలని తాజా సమావేశంలో ముఖ్యమంత్రి మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (cm kcr meet union home minister amitsha) ఇంటికి వెళ్లి ఆయనతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఉప్పుడు బియ్యం సమస్యపై ఆయనకూ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
ఇదీచూడండి:ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి