వరంగల్ నగరపాలక సంస్థ, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ఛైర్మన్లు 64 మంది పాల్గొన్నారు.
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘జరగబోయే ఎన్నికల ప్రాధాన్యాన్ని ప్రతీ ఒకరు గుర్తించి పనిచేయాలి. తెలంగాణలో తెరాస అత్యంతబలంగా ఉంది. 60 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయి. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గెలుపే అస్త్రంగా మారాలి తప్ప ఓటమి గురించి మాట్లాడే పరిస్థితి రావొద్దు. మున్ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ మనదే విజయమనే సంకేతాలు చాటాలి. ఎమ్మెల్యేలు ముఖ్యపాత్ర పోషించాలి. సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. కార్యకర్తలు, నేతలతో ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి మెలిసి పనిచేయాలి.