లక్షల మంది కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే పార్టీ గొప్పగా ముందుకెళ్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కార్యకర్తల బీమా కోసం బీమా కంపెనీలకు ప్రీమియం చెక్కులు అందజేశారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలను అధిగమించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సంకల్ప బలం, ముహుర్తం వల్లే పార్టీ అజేయశక్తిగా ఆవిర్భవించిందన్నారు. కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించడం సంతోషంగా ఉందన్న కేటీఆర్... కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
60 లక్షల మంది కార్యకర్తల ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్ల ప్రీమియం చెక్కులు... బీమా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ అందజేశారు. ఇప్పటివరకు కార్యకర్తల బీమా కోసం రూ.47.65 కోట్లు చెల్లించినట్టు వివరించారు. కార్యకర్తల సంక్షేమానికి మరికొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తామని వెల్లడించారు. ఏ ఒక్క కార్యకర్త కష్టంలో ఉన్నా కుటుంబసభ్యుడిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా కార్యకర్తలు నడుచుకోవాలని కోరారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. తెరాస జిల్లా కార్యాలయాల నిర్మాణం 90 శాతం పూర్తైనట్టు వివరించారు.