భాజపా నేతలు గోబెల్స్‌కు కజిన్ బ్రదర్స్‌లా వ్యవహరిస్తున్నారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అబద్ధాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెరాస, ఎంఐఎం సర్కారు అని పేర్కొనడం... ముస్లింలపై భాజపా వ్యతిరేకతను బయట పెడుతోందన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదులతో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెరాసపై దేనికి ఛార్జ్‌షీట్ వేస్తారు... ప్రగతి పథంలో దూసుకెళ్తున్నందుకా? అని మండిపడ్డారు.
హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఒక్క పైసా అదనంగా ఇచ్చారేమో కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రులెవరైనా సూటిగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఛార్జ్‌షీట్ వేయాలంటే భాజపాపై చాలా అంశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నందుకు భాజపాపై ఛార్జ్‌షీట్ వేయాలన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో చార్మినార్, గోల్కొండ, జీహెచ్ఎంసీని కూడా భాజపా అమ్ముతుందని ధ్వజమెత్తారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోనందుకు... 12 కోట్ల మంది నిరుద్యోగులు మోదీపై ఛార్జ్‌షీట్ వెయ్యాలన్నారు. కరోనా ప్యాకేజీలు, జన్‌ధన్ ఖాతాల్లో సొమ్ము జమ పేరుతో మోసం చేసినందుకు వ్యాపారులు, పేదలు ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, నవోదయ పాఠశాలల కేటాయింపులో మొండిచేయి.. ఐటీఐఆర్ రద్దు, రైతు వ్యతిరేక చట్టాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎదురుదాడి చేశారు. వరద సాయం చేయనందుకు, రోడ్ల అభివృద్ధికి అడ్డుపడుతున్నందుకు అంటూ... యాభై అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు.