తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది.. ఏపీలో రాజధాని మార్చుతామంటేనే ఆందోళనలు జరుగుతున్నాయని.. తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన జరిగిందని.. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. తాను త్వరలోనే సీఎం అవుతాననేది ఊహాగానాలేనని పేర్కొన్నారు. సీఎం పదవి గురించి మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
పవన్ ఏం చేసిన మాకు అవసరం లేదు
జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా తమకు సంబంధం లేదని.. పవన్ కల్యాణ్ ఏం చేసినా ఏపీ ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకు అభ్యర్థులే కరవయ్యారని... కాంగ్రెస్, భాజపాలు బీ ఫారాలు ఇస్తామన్నా తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెస్, భాజపా లోపాయకారీ పొత్తులు పెట్టుకుని.. బయటకు డ్రామాలు చేస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
లక్ష్మణ్ నిధులు తెచ్చారా?
తెలంగాణలో కట్టినట్లుగా రెండు పడక గదుల ఇళ్లు.. భాజపా పాలిత రాష్ట్రాల్లో కట్టారా చెప్పాలని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. కిషన్ రెడ్డి కొల్లూరు వస్తే... ఎర్ర తివాచీ పరచి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చూపిస్తానన్నారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఏమైనా అదనపు నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. తమది ఉద్యోగులకు అనుకూల ప్రభుత్వమని... నివేదిక వచ్చాక పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
సమయానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు
జీహెచ్ఎంసీలో ముందుస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని... ఈసారి కూడా తమదే విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని విభజించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు ఓటేయాలని కోరిన కేటీఆర్.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లు పాలనపై పూర్తి దృష్టి సారిస్తామన్నారు.
ఇదీ చూడండి: 'మీలాగా డబ్బున్న అభ్యర్థులు లేరు... నిజమైన కార్యకర్తలనే నిలిపాం'