ఆన్లైన్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సహా పట్టభద్రుల ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నికల సన్నద్ధతపై... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో పురపాలకశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు సమావేశమయ్యారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనేక కారణాలతో నగరవాసులకు ఆస్తులపై సంపూర్ణ హక్కులు దక్కకుండా కొన్ని సమస్యలు ఉన్నాయన్న మంత్రి... వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థిరాస్తులపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు.
ప్రగతి నివేదిక ప్రకటిస్తాం.
ఐదేళ్లుగా హైదరాబాద్ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి... అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు కేటీఆర్ వివరించారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్లతో రహదార్లను అభివృద్ధి చేసి, లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు రప్పించినట్టు వెల్లడించారు. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 67వేల కోట్లు చేసిందని... ఈ కార్యక్రమాలు, పథకాలు, కల్పించిన మౌలిక వసతులు, సంబంధిత సమాచారంతో ప్రగతి నివేదిక విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల పనితీరుకు ప్రగతి నివేదిక నిదర్శనంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్దఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు సూచించారు.
ఓటరు నమోదులో పాల్గొనండి