తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2019, 11:37 PM IST

ETV Bharat / city

'మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం ఏకపక్షమే..'

మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... తెరాస విజయం ఏక పక్షమేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు ఎంత హడావుడి చేసినా పట్టించుకోవద్దని.. ప్రజలు తెరాస వైపే ఉన్నారని చెప్పారు. పురపాలక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

ktr

'మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం ఏకపక్షమే..'

మున్సిపాలిటీ ఎన్నికలకు తెరాస పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. తెలంగాణ భవన్​లో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ ఐదు గంటలకుపైగా చర్చించారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలపై సమీక్ష జరిపారు. ఒక్కో మున్సిపాలిటీపై కూలంకషంగా చర్చించారు. తెరాస బలాలు, బలహీనతలతోపాటు... ఇతర పార్టీల్లో పోటీ చేసే అవకాశం ఉన్న నేతలు, అక్కడ ప్రభావితం చేయగలిగే నేతలు, ముఖ్య నాయకుల వివరాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస హవా కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెరాస ఏకపక్షంగా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆ పార్టీలది మేకపోతు గాంభీర్యం

ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదుకు మున్సిపాలిటీల్లో విశేష స్పందన కనిపించిందని కేటీఆర్ అన్నారు. కొన్నిపార్టీలు హడావుడి చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని.. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లాలన్నారు. పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. కొన్ని మున్సిపాలిటీలపై సమీక్ష సందర్భంగా విజయం తెరాసదేనని... అయితే ఇటీవల భాజపా కొంత పుంజుకుంటోందని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం.

ఈనెల 31లోగా కమిటీలు

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ఆ సమావేశాలకు ప్రజా ప్రతినిధులందరితోపాటు ముఖ్య నేతలందరినీ ఆహ్వానించాలని కేటీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు విజయవంతమైందని.. కమిటీల ఏర్పాటు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఈనెల 31లోగా బూత్, గ్రామ, డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కనీసం యాభై శాతం ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కమిటీ నాయకులకు పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఆరోపణలు తిప్పికొట్టండి..

తెరాస జిల్లా కార్యాలయాల నిర్మాణాలను దసరా నాటికి సిద్ధం చేయాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నిర్మాణాలను రోజువారీగా పర్యవేక్షించేందుకు ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డితో కమిటీని ఏర్పాటు చేశారు. తెరాస నేతలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. సమస్యలను స్థానిక జడ్పీ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను వివిధ వేదికల ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు.

ఇదీ చూడండి: పీవీ సింధు దేశానికి గర్వకారణం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details