TRS Rasta Roko : కేంద్రంపై వడ్లవార్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మోదీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిరసనలు, ధర్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టిన తెరాస నేతలు.. ఇవాళ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించనున్నారు. తెలంగాణలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండు చేస్తూ తెరాస ఇవాళ నిరసన చేపట్టనున్నారు.
TRS Rasta Roko : నేడు జాతీయ రహదారులపై తెరాస రాస్తారోకో - paddy procurement issue
TRS Rasta Roko : అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య.. ఇటు రాష్ట్రంలోని తెరాస-ప్రతిపక్షాల మధ్య వడ్లవార్ కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం అడుగుతోంటే.. కొనమని తేల్చి చెప్పామని కేంద్రం అంటోంది. ఈ క్రమంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించిన తెరాస సర్కార్.. ఇవాళ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించనుంది.
TRS Rasta Roko in Telangana : నాగ్‌పుర్ జాతీయ రహదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ వద్ద; బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద; విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ వద్ద; ముంబయి జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద దిగ్బంధనం చేయనున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఒక చోట పాల్గొనే వీలుంది. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, పార్టీ శ్రేణులు ఆయా ఆందోళనల్లో పాల్గొననున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే తెరాస అయిదంచెల పోరాట కార్యక్రమాలకు సమాయత్తమయింది. మొదటి అంచెలో.. నాలుగో తేదీన మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.