తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS Plenary 2021: నేడే తెరాస ప్లీనరీ.. గులాబీమయమైన రాజధాని - TRS Plenary 2021 today

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి హాజరుకానున్న సుమారు 6వేలకుపైగా ప్రతినిధులు.. కేసీఆర్​ను పదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. రాజకీయ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర, జాతీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్లీనరీ దృష్ట్యాహైటెక్స్ పరిసరాలతోపాటు హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేశారు.

TRS Plenary 2021 today and every thing is ready for meeting in hyderabad hitex
TRS Plenary 2021 today and every thing is ready for meeting in hyderabad hitex

By

Published : Oct 25, 2021, 5:37 AM IST

నేడే తెరాస ప్లీనరీ.. గులాబీమయమైన రాజధాని

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... ఏడున్నరేళ్లుగా నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెరాస తొమ్మిదో ప్లీనరీ నేడు జరగనుంది. ఏప్రిల్ లోనే జరగాల్సిన ఆ సమావేశం.. కరోనా కారణంగా వాయిదాపడింది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగే ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 6వేల మంది ప్రతినిధులు హాజరుకానుండగా.... వారికి ప్రత్యేక పాస్‌లు జారీచేశారు. మహిళా ప్రతినిధులు గులాబీ చీర, పురుషులు గులాబీచొక్కాతో హాజరుకావాలని పార్టీ అధినాయకత్వం నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ఏర్పాటుచేశారు. ప్లీనరీ వేదికపై తీగలవంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వేదికపై కాకతీయకళాతోరణం, వేదిక కింద కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల నమూనా ఏర్పాటు చేశారు. గులాబి దళపతి కేసీఆర్ వేదికపై అమరవీరులకు నివాళులు అర్పించి... తెలంగాణ తల్లికి పూలమాల వేస్తారు. ఆ తర్వాత తెరాస జెండాను ఆవిష్కరిస్తారు. ప్రధాన ద్వారం వద్ద కేసీఆర్ భారీ కటౌట్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను ఏర్పాటు చేశారు. సభాప్రాంగణానికి చేరుకునే మధ్యలో... కేసీఆర్ జీవితవిశేషాలు, ఉద్యమ చరిత్ర, పార్టీ ఏడేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

పదోసారి కేసీఆర్​ ఎన్నిక..

ప్లీనరీలో తెరాస రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అధ్యక్ష పదవికి కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా... కేసీఆర్​ ఎన్నిక పదోసారి లాంఛనం అయ్యింది. అధ్యక్షోపన్యాసం చేయనున్న కేసీఆర్​... ఇరవై ఏళ్ల ప్రస్థానంతో పాటు... ఏడున్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ప్లీనరీ దృష్ట్యా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ వివరించారు.

ప్రత్యేక వంటకాలు..

ప్లీనరీకీ హాజరైన ప్రతినిధులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులందరికీ... దాదాపు 15 వేల మందికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత.. రాష్ట్ర, జాతీయ రాజకీయ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తీర్మానాల ఆమోదం తర్వాత కేసీఆర్ ప్రసంగంతో సాయంత్రం 5 తర్వాత ప్లీనరీ ముగియనుంది.

గులాబీమయంగా నగరం..

తెరాస ప్లీనరీ దృష్ట్యా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ నేతృత్వంలో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. హైటెక్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో భారీగా గులాబీ జెండా తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details