తెలంగాణ

telangana

ETV Bharat / city

సరికొత్త అధ్యాయం లిఖించిన తెరాస పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించనున్న గులాబీ జెండా - కేసీఆర్​

TRS party entered into National politics: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సరికొత్త అధ్యాయం లిఖించనుంది. గులాబీ జెండా దేశానికి విస్తరించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన తెరాస... జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రే ధ్యేయంగా రూపాంతరం చెందనుంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్​ సిద్ధమయ్యారు. ఈ దిశలో కొన్ని నెలల నుంచి కసరత్తు జరుగుతుండగా... విజయదశమి సందర్భంగా లాంఛనం పూర్తి కానుంది.

TRS
TRS

By

Published : Oct 5, 2022, 8:29 AM IST

TRS party entered into National politics: తెలంగాణ రాష్ట్ర సమితి.. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాదన దిశగా ముందుకు సాగింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని బలంగా నమ్మి తెరాస అధినేత కేసీఆర్​ గమ్యాన్ని ముద్దాడారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెరాసను స్థాపించి గులాబీ జెండాను ఎగురవేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొని కొన్నాళ్లకు బయటకు వచ్చారు. ఆ తర్వాత తెరాస రాజకీయం మలుపులు తిరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ... 2010 నుంచి క్రమంగా బలపడుతూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్​ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెరాస ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.

రాష్ట్రంలో గులాబి దళానికి కట్టిన పట్టం.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్​... కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నవతెలంగాణ భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 నుంచి ఏ ఎన్నిక వచ్చినా తెరాస ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలు సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని గులాబీ బాస్‌ ప్రకటించారు. 2018లో శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరుగులేని విజయం సాధించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ బాధ్యతలు స్వీకరించారు.

ప్రంట్​ ఏర్పాటులో వెనుకంజ..కేంద్రం విభజన హామీలను అమలు చేయకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం, రుణాలపై ఆంక్షలు తదితర పరిణామాల నేపథ్యంలో భాజపాపై పోరు కోసం జాతీయ కూటమి వైపు మొగ్గు చూపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. కానీ, లోక్ సభ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించడం.... రాష్ట్రంలోనూ ఎన్నికల ఫలితాలు తెరాసకు అనుకూలంగా రాకపోవటంతో అడుగు ముందుకు పడలేదు.

సంక్షేమ పథకాల్లో ముందంజ.. స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్​ నేతృత్వంలోని తెరాస సర్కార్... వివిధ అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇళ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతి పెద్దదైన బహులదశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాష్ట్రంలో రికార్డు విస్తీర్ణంలో పంటలు సాగయ్యేలా కృషి చేసింది.

భాజపాపై సమర శంఖం.. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా రైతు ఆందోళనలు, రాష్ట్రాల పట్ల భాజపా అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో కేసీఆర్​ దృష్టి మరోమారు జాతీయ రాజకీయాలపై పడింది. భాజపా సర్కార్ వైఖరి, విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెుదట్లో ఎన్​డీఏతో సఖ్యతగానే ఉన్నా... రెండేళ్లుగా పూర్తిగా విభేదిస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వివిధ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లి భాజపా, కాంగ్రెసేతర నేతలతో మంతనాలు జరిపారు. భాజపాకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కొందరు నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్​తో సమావేశమయ్యారు.

దేశ రైతుసంఘాల నేతలను హైదరాబాద్ పిలిపించి రెండ్రోజులు చర్చించారు. పార్టీ ప్లీనరీలోనూ జాతీయ రాజకీయాల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించిన గులాబీ బాస్‌... దేశ రాజకీయాల్లోకి వెళ్లాలా... వద్దా... అంటూ ప్రజల ఆమోదం తీసుకున్నారు. సందర్భం ఏదైనా భాజపా సర్కార్‌ను ఎండగట్టారు. తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా అమలు కావాలని... దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రగతిశీల భారత్ ధ్యేయంగా కాంగ్రెస్, భాజపాతో సంబంధం లేకుండా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్... ఆ దిశగా కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం ఉన్న రాజకీయ పార్టీని ఇక దేశం కోసం నడిపించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని దేశానికి విస్తరించాలని... రూపాంతరం చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details