తెలంగాణ

telangana

ETV Bharat / city

విపక్షాలకు బ్రేకులేస్తూ బల్దియా ప్రచారంలో దూసుకెళ్తున్న కారు - cm kcr meeting in ghmc elections

బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. 100 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆకర్షణీయ హామీలతో భాజపాపై ముప్పేట దాడితో ముందుకు సాగుతోంది. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. సంక్షేమ పథకాలను, నగర అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

trs party campaign and plans to win ghmc elections 2020
బల్దియా ప్రచారంలో దూసుకెళ్తున్న కారు

By

Published : Nov 27, 2020, 7:15 PM IST

గ్రేటర్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తెరాస పార్టీ... ఎత్తులు, పైఎత్తులతో ప్రచారం ముమ్మరం చేసింది. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ.. కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం.. డివిజన్ ఇంఛార్జి నేతల బస్తీ, కాలనీ సమావేశాలు.. కేటీఆర్ రోడ్ షోలు.. కేసీఆర్ సభ.. ఈ.. నాలుగంచల ప్రచార వ్యూహంతో రంగంలోకి దిగిన తెరాస.. వేగం పెంచింది. ఇప్పటికే డివిజన్ స్థాయి ప్రచారంతో పాటు.. కేటీఆర్ రోడ్ షోలు జోరుగా సాగుతున్నాయి.

రోజుకో వ్యూహంతో..

ఆరేళ్లలో జరిగిన అభివృద్ధే ప్రధాన అస్త్రంగా ప్రచారం ప్రారంభించిన తెరాస.. విపక్షాల విమర్శలతో రోజుకో విధంగా తన వ్యూహాలను మారుస్తోంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున.. జీహెచ్ఎంసీలో తెరాసను గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందంటూ ఓటర్లను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తున్నారు. మరోవైపు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చేలా ఉచిత మంచచినీటి సరఫరా హామీని ప్రకటించింది. ప్రజల్లో విశ్వాసం కలిగించే ఉద్దేశంతో స్వయంగా ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ నగర ప్రజలకు హామీల జల్లు కురిపించారు.

అభివృద్ధి కావాలా.. అల్లర్లు కావాలా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా ప్రధాన లక్ష్యంగా తెరాస ప్రచారం సాగుతోంది. అభివృద్ధి కావాలా.. అల్లర్ల నగరం కావాలా అని అభ్యర్థుల నుంచి కేటీఆర్, కేసీఆర్ వరకు ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తున్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. జీహెచ్ఎంసీలో భాజపా గెలిస్తే.. అశాంతి పెరుగుతుందని ఓటర్లకు తెరాస వివరిస్తోంది. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను.. ప్రచారంలో విస్తృతంగా వాడుకుంటోంది. భాజపా ఛార్జ్ షీట్ ఆరోపణలను తిప్పికొట్టి.. ఆ పార్టీపైనే వేయాలంటూ ఎదురుదాడి చేస్తోంది. ఎంఐఎంతో తమకు ఎలాంటి సంబంధం లేదనే అంశానికి ప్రచారంలో ప్రాధాన్యమిస్తోంది. తమకు ప్రధాన పోటీ ఎంఐఎంతోనేనని తెరాస చెబుతోంది.

వివిధ సంఘాల మద్దతు

ఓ వైపు అభివృద్ధి నినాదం, విపక్షాలపై దాడితో ప్రచారం చేస్తున్న తెరాస.. మరోవైపు వివిధ సామాజిక వర్గాలు, సంఘాల మద్దతు కూడబెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. నాయి బ్రాహ్మణులు, రజకులకు లబ్ధి చేకూర్చేలా సెలూన్లకు, దోభిఘాట్​లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల హామీల్లో తెలిపింది. గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారి మద్దతు కూడగట్టుకునేందుకు ఆయా సంఘాలతో చర్చలు చేస్తోంది. తెరాసకే మద్దతు ఇస్తున్నట్లు మార్వాడీ, జైన్, మహేశ్వరీ, తదితర సంఘాలతో ప్రకటనలు చేయించాయి. తెలంగాణభవన్​లో సమావేశమైన 37 బీసీ సంఘాలు.. తెరాసకు మద్దతు తెలిపాయి. త్వరలో వివిధ సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహించి పలు హామీలు ఇచ్చి మద్దతు తీసుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కేసీఆర్ సభ..

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల సారథ్య బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. రోజూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటూ సూచనలు ఇస్తూ.. మరోవైపు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ పరిస్థితులు, విపక్షాల ఎత్తులను గమనిస్తూ..ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. కేటీఆర్​తో పాటు ముఖ్యనేతలతో నిరంతరం చర్చిస్తూ వ్యూహ, ప్రతివ్యూహాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈనెల 29న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details