TRS MPs on ST Reservations: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశామని తెరాస ఎంపీలు స్పష్టం చేశారు. గిరిజనులకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారని.. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోంశాఖకు పంపారని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ సభను తప్పుదోవ పట్టించారని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలో మీడియా సమావేశంలో ఎంపీలు మాట్లాడారు.
ఎస్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లు... తమకు అందలేదనటం చూస్తుంటే తెలంగాణపై కేంద్రానికి ఉన్న అక్కసుకు నిదర్శనమని... తెరాస ఎంపీలు ఆరోపించారు. తెలంగాణ ప్రతిపాదనలు పంపలేదనటంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు గిరిజనశాఖ సహాయ మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద లోక్‌సభలో నోటీసులు ఇచ్చారు. వెంటనే కేంద్ర మంత్రిని భర్తరఫ్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోంశాఖకు పంపారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాం. ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు చెప్పడం దారుణం." -ఎంపీ నామ నాగేశ్వరరావు