కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం వంగరలో పుట్టారు వాణీదేవి. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ఆర్ట్స్‌లో డిప్లొమో పూర్తి చేశారు. వర్ణాలతో అద్భుతాలు చేయడం ఆమె ప్రత్యేకత. విద్యావేత్తగా, సామాజిక సేవకురాలిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువగా కళాకారిణిగా రాణించారు. సాలార్‌జంగ్ మ్యూజియంలో ఇప్పటికీ ఆమె వేసిన అద్భుతమైన చిత్రాలు మనకు కనువిందు చేస్తాయి. ‘ఓరోజు బాపు(నాన్న) పుస్తకాలు సర్దుతుంటే ‘హౌ టు డ్రా ఏ పెయింటింగ్’ అనే పుస్తకం కనిపించింది. దానిపై నాన్న సంతకం కూడా ఉంది. ఆ పుస్తకం వల్లే నాకు చిత్రలేఖనంపై ఆసక్తి కలిగింది. పచ్చటి పొలాలు, చుట్టూ కొండలతో మా ఊరు చాలా అందంగా ఉండేది. పొలాల దగ్గర, వరి కల్లాల దగ్గర కూర్చుని.. అక్కడ పనిచేసే స్త్రీల చిత్రాలను గీసేదాన్ని. నాకు పెయింటింగ్ అంటే ఇష్టమని నేనెప్పుడూ నాన్నకు చెప్పలేదు. ఆయనే నా ఆసక్తిని గమనించి ప్రముఖ చిత్రకారులతో నాకు సలహాలు, సూచనలు ఇప్పించేవారు’ అనే వాణీదేవి ఇప్పటివరకు దేశ, విదేశాల్లో వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు.
నాన్నే నేర్పారు..
చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో కొన్నేళ్లపాటు అధ్యాపకురాలిగా పనిచేశారు వాణి. ఆ సమయంలో సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. ‘జాతీయ నాయకుడిగా ఉన్నా ఆ ప్రభావాలకు మమ్మల్ని దూరంగానే పెంచారు నాన్న. దాంతో మేం ప్రత్యేకం అని ఎప్పుడూ అనుకోలేదు. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. నాకు ఇద్దరన్నదమ్ములు. ‘బాపూ.. ఇదేంటి?.. అదేంటి? అని మేం అడిగిన ప్రతిదానికీ ఓపిగ్గా జవాబులిచ్చేవారాయన. చిన్నతనంలో ఈత కొట్టేదాన్ని. సైకిల్ తొక్కేదాన్ని. మా అమ్మ సత్యమ్మ నాపై చేసే ఫిర్యాదులన్నింటినీ నవ్వుతూ స్వీకరించి వదిలేసేవారాయన. మితభాషిగా ఉంటూనే ప్రతి పని ధైర్యంగా చేసే ఆయన గుణం నాకూ వచ్చింది. ఎలా బతకాలి, ఏ సందర్భంలో ఎలా నడవాలి వంటివన్నీ బాపూనే నాకు నేర్పించారు’ అంటారు వాణీదేవి.